హనుమ విహారే మాకు కెప్టెన్ గా రావాలి... ఆంధ్రా రంజీ ఆటగాళ్ల లేఖ

  • ఆంధ్రా రంజీ క్రికెట్లో వివాదం
  • ఓ ఆటగాడిపై కోపం ప్రదర్శించిన హనుమ విహారి
  • ఆటగాడి తండ్రి రాజకీయ నేత కావడంతో ఏసీఏపై ఒత్తిళ్లు
  • కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హనుమ విహారి 
  • విహారి తప్పేమీ లేదన్న ఇతర ఆటగాళ్లు
ఆంధ్రా రంజీ క్రికెట్లో నేడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ రాజకీయ నేత కుమారుడిపై తాను కోపగించుకున్నందుకు, తనను కెప్టెన్ గా రాజీనామా చేయాలని కోరారని ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. 

గత జనవరిలో హనుమ విహారి ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ గా వైదొలగడంతో సీనియర్ ఆటగాడు రికీ భుయ్ పగ్గాలు అందుకున్నాడు. అయితే, తమకు హనుమ విహారే కెప్టెన్ గా రావాలంటూ రికీ భుయ్ సహా ఆంధ్రా రంజీ ఆటగాళ్లందరూ నేడు తమ సంతకాలతో కూడిన లేఖను ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి, సీఈవోకు అందజేశారు. 

తమ లేఖలో క్రికెటర్లు ఏమని పేర్కొన్నారంటే... "ప్రస్తుతం హనుమ విహారి విషయంలో జరుగుతున్న వివాదం గురించి ఈ లేఖ రాశాం. తనను హనుమ విహారి అభ్యంతరకర భాషలో తిట్టాడంటూ జట్టులోని ఓ ఆటగాడు ఫిర్యాదు చేశాడు. విహారి తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఆ ఆటగాడు ఆరోపించాడు. హనుమ విహారి సదరు ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించాడన్నది అవాస్తవం. 

అయితే, ఏదైనా క్రికెట్ జట్టులో తిట్టడం అనేది సర్వసాధారణం. ఓ జట్టులో కసి రగిల్చి మెరుగైన ఫలితాలు రాబట్టడంలో ఈ తరహా తిట్ల పురాణం ఉపయోగపడుతుంది. క్రికెట్ జట్ల డ్రెస్సింగ్ రూముల్లో ఈ తిట్ల భాష దశాబ్దాలుగా వస్తోంది. ఇది కొత్తేమీ కాదు. దురదృష్టవశాత్తు సదరు ఆటగాడు దీన్ని వ్యక్తిగతంగా తీసుకున్నాడు. 

ఈ వ్యవహారం మొత్తానికి ఆటగాళ్లం, సహాయక సిబ్బంది కూడా ప్రత్యక్ష సాక్షులం. హనుమ విహారే మా కెప్టెన్ గా కొనసాగాలని మేం కోరుకుంటున్నాం. హనుమ విహారితో మాకెలాంటి సమస్యలు లేవు. మా నుంచి అత్యుత్తమ ఆటతీరును రాబట్టుకోవడంలో అతడి కృషి ఉంది. 

హనుమ విహారి నాయకత్వంలో మా జట్టు ఎంతో గొప్పగా రాణించింది. జట్టును ఐక్యంగా నడిపించడంలో అతడి నాయకత్వ ప్రతిభ ఉంది. విహారి కెప్టెన్సీలో ఏడు సార్లకు పైగా దేశవాళీ పోటీల్లో క్వాలిఫై అయ్యాం. 

ఆటగాళ్లుగా ఈ రంజీ టోర్నీ మాకెంతో ముఖ్యమైనది. ఇప్పటికే సీజన్ తొలి మ్యాచ్ లో పటిష్ఠమైన బెంగాల్ ను ఓడించాం. ఆంధ్రా రంజీ టీమ్ ఆటగాళ్లుగా హనుమ విహారి మాకు కెప్టెన్ గా రావాలని కోరుకుంటున్నాం" అని వివరించారు.

రికీ భుయ్, పృథ్వీరాజ్ యర్రా, పి.గిరినాథ్ రెడ్డి, అశ్విన్ హెబ్బార్, డీబీ ప్రశాంత్, శశికాంత్, యూఎంఎస్ గిరినాథ్, పీవీఎస్ఎన్ రాజు, జ్ఞానేశ్వర్, నితీశ్ తదితరులు లేఖపై సంతకాలు చేశారు.


More Telugu News