370 సీట్లు సాధిస్తామన్న మోదీ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందన

  • బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుచుకోలేదన్న పీకే
  • బీజేపీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకే అలా అని ఉంటారని వ్యాఖ్య
  • తమిళనాడు, తెలంగాణల్లో బీజేపీ మెరుగైన స్థానాలు సాధిస్తుందన్న పీకే
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 సీట్లను గెలుచుకోలేదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఒకవేళ 370 సీట్లను గెలుచుకుంటే అద్భుతమేనని అన్నారు. తాము ఒంటరిగానే 370 సీట్లను సాధిస్తామని పార్లమెంటులో ప్రధాని మోదీ చెప్పారని... బీజేపీ శ్రేణులను ఉత్తేజితులను చేసేందుకే ఆయన అలా అని ఉంటారని చెప్పారు. 

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఈసారి గతం కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తుందని పీకే అంచనా వేశారు. సందేశ్ ఖలి ఘటనతో బెంగాల్ లో బీజేపీ పని అయిపోయిందని భావిస్తున్న వారికి... బెంగాల్ ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయని చెప్పారు. తమిళనాడులో తొలిసారి బీజేపీ డబుల్ డిజిట్ ఫిగర్ సాధిస్తుందని చెప్పారు. తెలంగాణలో సైతం బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందని తెలిపారు. 

2024 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే... ప్రజాస్వామ్య వ్యవస్థలు మరింత బలహీనంగా మారుతాయని పీకే చెప్పారు. ఎవరైనా వ్యక్తి కానీ, ఒక గ్రూప్ కానీ శక్తిమంతంగా మారినప్పుడు సమాజం యొక్క ప్రజాస్వామ్య నిర్మాణం రాజీపడుతుందని అన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కూడా దీనికి ఒక ఉదాహరణ అని చెప్పారు. మన దేశ పరిస్థితి చైనా అంతలా మారకపోయినా... నిరంకుశ పాలన సంకేతాలు మాత్రం మరింత ఎక్కువవుతాయని అంచనా వేశారు. అయితే, దేశంలో 15 రాష్ట్రాలను విపక్ష పార్టీలు పాలిస్తున్నాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని చెప్పారు. 

ఇండియా కూటమి చాలా ఆలస్యంగా ఏర్పడిందని.. గత ఏడాది ఆ కూటమి 10 రోజులకు మించి పనిచేయలేదని పీకే అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 7 రోజల పాటు యూరప్ కు వెళ్లారని... ఇండియా కూటమి కనీసం అన్ని రోజుల పాటు కూడా ఎందుకు పని చేయలేకపోయిందని ప్రశ్నించారు. 2024 ఎన్నికలను దాటి ఇండియా కూటమి చూడాల్సి ఉందని సూచించారు.


More Telugu News