రాముడు అయోధ్యలో పుట్టాడని గ్యారెంటీ ఏమిటని అడిగిన వాళ్లను అలా అడిగితే తప్పేంటి?: బండి సంజయ్

  • మీరు మీ అమ్మకే పుట్టారని గ్యారెంటీ ఏమిటి? అని అడిగితే తప్పేమిటని ప్రశ్న
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు రుణమాఫీ అమలు చేసిందా? అని ప్రశ్న
  • బీఆర్ఎస్‌పై బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని ఆవేదన
శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడని గ్యారెంటీ ఏమిటి? అని అడిగినవాళ్లను... మీరు మీ అమ్మకే పుట్టారని గ్యారెంటీ ఏమిటి? అని అడిగితే తప్పేమిటి? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ నుంచి రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొహెడ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారని... కానీ రైతు రుణమాఫీ అమలు చేశారా? అని నిలదీశారు. రూ.500కే గ్యాస్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.

గత బీఆర్ఎస్ సర్కార్ అక్రమాలపై కొట్లాడింది తానేనని, దీంతో తనపై వంద కేసులు పెట్టిందని మండిపడ్డారు. తాను 150 రోజుల పాటు ఎండనక, వాననక, చలి అనక ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేశానన్నారు. కేసీఆర్‌ను గద్దె దించింది... కొట్లాడింది బీజేపీ అయితే మీరు మాత్రం కాంగ్రెస్‌కు ఓటు వేశారని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు. పేదల కోసం బీజేపీ కొట్లాడినా ఓట్లు వేయలేదని... కాంగ్రెస్ కొట్లాడకున్నా ఓట్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు.. మరో 20 రోజుల్లో అన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండడంతో మళ్ళీ ఆరు గ్యారంటీలకు మంగళం పాడతారని అనుమానం వ్యక్తం చేశారు.

రామమందిరాన్ని తామే కట్టామని కచ్చితంగా చెప్పుకుంటామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మీరు బాబ్రీ మసీదును కడతామని చెప్పుకుంటే ఎవరు వద్దన్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. రానున్న ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు.. మోదీ ప్రధాని కావాలా? లేక రాహుల్ కావాలా? మోదీని మళ్లీ ప్రధానిగా చేయకుంటే మందిరం పోయి మసీదు వస్తుంది... ఇక ప్రజలే తేల్చుకోవాలని హెచ్చరించారు.

కరీంనగర్‌కు ఏం చేశానంటే..!

మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రతిరోజు తనను తిట్టడమే పని అని మండిపడ్డారు. కరీంనగర్‌కు ఏం చేశానో తనను అడిగే ముందు ఎంపీగా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి తాను రూ.697.87 కోట్లు తెచ్చానన్నారు. పేదోళ్లకు కరోనా వాక్సిన్ ఉచితంగా ఇచ్చామని గుర్తు చేశారు.


More Telugu News