వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఇదుగురూ లేరు... అయినా ఇండియా గెలిచింది: మైఖేల్ వాన్ ప్రశంసలు

  • రాంచీ టెస్టులో 5 వికెట్లతో టీమిండియా విన్
  • 3-1తో సిరీస్ కైవసం
  • తన అభిప్రాయాలను మార్చుకున్న వాన్
  • ఈ మ్యాచ్ లో పూర్తి ఘనత టీమిండియాకే దక్కుతుందని కితాబు
పలువురు అగ్రశ్రేణి క్రికెటర్లు లేకపోయినప్పటికీ టీమిండియా టెస్టు సిరీస్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను 3-1తో చేజిక్కించుకుంది. దీనిపై ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందించాడు.

ఏ చిన్న అవకాశం దొరికినా టీమిండియాను తూట్లు పొడిచేందుకు సిద్ధంగా ఉండే వాన్... రాంచీ టెస్టు ముగిశాక తన అభిప్రాయాలను మార్చుకున్నాడు. ఓ దశలో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోగానే వాన్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లు భయపడుతున్నారని వ్యాఖ్యానించాడు. 

అయితే, శుభ్ మాన్ గిల్, ధ్రువ్ జురెల్ పోరాటం కనబర్చి మ్యాచ్ లో టీమిండియాను విజేతగా నిలిపారు. దాంతో వాన్ తన అభిప్రాయాలను మార్చుకోకతప్పలేదు. అందుకు అతడి తాజా ట్వీట్ నిదర్శనం. 

"టీమిండియాలో వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఇదుగురూ లేరు... ఆ జట్టు టాస్ కోల్పోయింది... పైగా తొలి ఇన్నింగ్స్ లో ప్రత్యర్థికంటే వెనుకబడింది... అయినప్పటికీ మ్యాచ్ గెలిచింది" అంటూ కొనియాడాడు. 

ఈ మ్యాచ్ లో పూర్తి ఘనత టీమిండియాకే దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ టెస్టు విజయం ఎంతో స్ఫూర్తిదాయకం అని వాన్ పేర్కొన్నాడు. చాలామంది యువ ఆటగాళ్లు టీమిండియా జట్టులోకి వచ్చారని, వారు చాలాకాలం పాటు జట్టులో కొనసాగే అవకాశాలున్నాయని ప్రశంసించాడు.


More Telugu News