అక్రమాస్తుల కేసులో జయలలితకు రూ.100 కోట్ల జరిమానా కేసు.. బంగారు నగలు, ఆస్తుల విక్రయం ద్వారా చెల్లింపు

  • 2014లో జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించిన బెంగళూరు ప్రత్యేక కోర్టు
  • ఆమె చనిపోయి ఆరేళ్లు దాటినా జరిమానా చెల్లించని వైనం
  • ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 28 కిలోల నగలు, 800 కిలోల వెండి, వజ్రాల నగలు వేలం
  • వచ్చే నెలలో తమిళనాడు హోంశాఖకు నగలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 28 కిలోల బంగారు ఆభరణాలు వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. అక్రమాస్తుల కేసులో జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014లో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 100 కోట్ల జరిమానా విధించింది. జయలలిత మరణించి ఆరేళ్లు అయినా ఆమెకు విధించిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆస్తులు విక్రయించి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా ఆమె ఇంట్లోంచి అవినీతి నిరోధకశాఖ స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు నగలు, 800 కిలోల వెండి, వజ్రాల నగలు కోర్టుకు అప్పగించారు. వీటిని వేలం వేసి వచ్చిన సొమ్ము నుంచి జరిమానా చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆ నగలను వచ్చే నెల ఆరేడు తేదీల్లో తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగిస్తారు. వీటి విలు దాదాపు రూ. 40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మిగతా రూ. 60 కోట్లను స్థిరాస్తులను వేలం వేయడం ద్వారా సమకూర్చనున్నారు. దీంతోపాటు కేసు ఖర్చు రూ. 5 కోట్లను కూడా ఆస్తుల వేలం ద్వారా కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించనున్నారు.


More Telugu News