కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతాం: జగన్

  • 2022 లో కుప్పం పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు వెల్లడి
  • 672 కి.మీ. దూరం నుంచి జలాలను తీసుకొచ్చామని వివరణ
  • 6,300 ఎకరాలకు సాగు నీరు.. కుప్పం ప్రజలకు తాగునీరు అందిస్తామన్న జగన్
‘2022లో కుప్పంలో పర్యటించినపుడు కృష్ణా జలాలను తీసుకొస్తానని మాటిచ్చా.. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నా’ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. సోమవారం కుప్పంలోని శాంతిపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొన్నారు. కృష్ణా జలాలకు పూజలు చేసి, హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. కృష్ణా జలాలతో కుప్పం చెరువులను నింపుతామని చెప్పారు. 672 కి.మీ. దూరం నుంచి కృష్ణా నీటిని కుప్పంకు సగర్వంగా తీసుకొచ్చామన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీటిని విడుదల చేశామని జగన్ తెలిపారు.

దీంతో 6,300 ఎకరాలకు సాగు నీరు అందుతుందని, రెండు నియోజకవర్గాల్లో ప్రజలకు తాగునీరు అందుతుందని చెప్పారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. ఇన్నేళ్లలో బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. సొంత నియోజకవర్గానికే ఉపయోగపడని చంద్రబాబు.. రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాడో ప్రజలు ఆలోచించాలని కోరారు. కుప్పంలో తాము గెలవకపోయినా మిమ్మల్ని ఏనాడూ విమర్శంచలేదని, మీరంతా నావాళ్లేనని గర్వంగా చెప్పుకున్నానని జగన్ పేర్కొన్నారు.

సోమవారం ఉదయం రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్.. అక్కడి నుంచి కుప్పం చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కృష్ణా జలాలకు పూజలు చేశారు. బటన్ నొక్కి హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేశారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుతో కుప్పం, పలమనేరులోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు అందనుందని అధికారులు తెలిపారు.


More Telugu News