మా వ్యూహం మాకుంది... టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై పురందేశ్వరి స్పందన

  • నిన్న సీట్ల పంపకంపై టీడీపీ, జనసేన ప్రకటన
  • వాళ్లు అన్ని సీట్లను ప్రకటించలేదు కదా అంటూ పురందేశ్వరి వ్యాఖ్యలు
  • తమ పొత్తును బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని వెల్లడి 
టీడీపీ, జనసేన పార్టీలు నిన్న 118 స్థానాలతో అసెంబ్లీ సీట్ల పంపకంపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు కేటాయించారు. బీజేపీ కూడా తమతో పొత్తులో కలిశాక మిగతా సీట్లపై ప్రకటన చేస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పారు. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఏపీలో పొత్తులకు సంబంధించి బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 

"మా ప్రణాళిక మాకుంది... అయినా టీడీపీ, జనసేన అన్ని సీట్లను ఇంకా ప్రకటించలేదు కదా. కొన్ని సీట్లనే ప్రకటించారు. బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తు ఖరారు చేస్తే, అప్పుడు సీట్ల గురించి ఆలోచిస్తాం... ఎక్కడ పోటీ చేయాలన్నదాని గురించి ఆలోచిస్తాం. అప్పటివరకు 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో బూత్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాం" అని పురందేశ్వరి స్పష్టం చేశారు.


More Telugu News