ఇంగ్లండ్‌పై ‘అరుదైన సెంచరీ’ పూర్తి చేసిన స్పిన్నర్ అశ్విన్.. తొలి భారతీయ క్రికెటర్‌గా అవతరణ

  • ఇంగ్లండ్‌పై 100 టెస్ట్ వికెట్లు పూర్తి చేసుకున్న స్పిన్ దిగ్గజం
  • రాంచీ టెస్టు తొలి రోజున బెయిర్‌స్టో వికెట్ సాధించడం ద్వారా మైలురాయి అందుకున్న అశ్విన్
  • ఇంగ్లండ్‌పై 1000 పరుగులు కూడా పూర్తి చేసుకున్న ‘ఆఫ్ స్పిన్నర్’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అరుదైన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా అవతరించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ తొలి రోజున జానీ బెయిర్‌స్టో‌ను ఎల్‌బీడబ్ల్యూ ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌పై ప్రస్తుతం 23వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ ఈ మైలురాయిని సాధించాడు. ఇంగ్లండ్‌ జట్టుపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌పై 36 టెస్టులు ఆడిన వార్న్ ఏకంగా 195 వికెట్లు పడగొట్టాడు. ఇక భారతీయ స్పిన్నర్ల విషయానికి వస్తే అశ్విన్ తర్వాతి స్థానంలో బీఎస్ చంద్రశేఖర్ ఉన్నారు. ఇంగ్లండ్‌పై 23 మ్యాచ్‌లు 95 వికెట్లు తీశాడు. ఇక అనిల్ కుంబ్లే 19 మ్యాచ్‌ల్లో 92 వికెట్లతో ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు.

ఇంగ్లండ్‌పై అశ్విన్ కేవలం బంతితోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణించాడు. పలు కీలక ఇన్నింగ్స్ ఆడిన ఈ స్పిన్నర్ ఇంగ్లండ్‌పై 1000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక ఇటీవలే రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడవ టెస్టులో అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే. అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఫీట్‌ని సాధించిన రెండవ భారతీయ బౌలర్‌గా నిలిచాడు.


More Telugu News