న్యూయార్క్‌లో అగ్నిప్రమాదం.. భారతీయ యువకుడి దుర్మరణం

  • నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో శుక్రవారం ఘటన
  • ఈబైక్ బ్యాటరీ కారణంగా మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో మొదలైన మంటలు
  • ఘటనలో గాయపడ్డ భారత యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఘటనలో మొత్తం 17 మంది గాయపడ్డట్టు స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెల్లడి
అమెరికాలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో భారతీయ యువకుడు ఫజిల్ ఖాన్ (27) దుర్మరణం చెందాడు. హార్లెమ్ ప్రాంతంలోని ఆరంతస్థుల అపార్లమెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ-బైక్‌ బ్యాటరీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. భవనంలో చిక్కుకుపోయిన ఫజిల్ ఖాన్‌ను అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

న్యూఢిల్లీకి చెందిన ఫజిల్ ఖాన్ కొలంబియా జర్నలిజం కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. హెచింగర్ రిపోర్ట్ అనే విద్యాసంబంధిత వెబ్‌సైట్‌లో పనిచేసేవాడు. 

భవనం మూడో ఫ్లోర్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు స్థానిక మీడియా చెబుతోంది. మంటలు మొదలైన అపార్ట్‌‌మెంట్‌లోని వారు పారిపోతూ వాటి తలుపులు తీసి పెట్టారని చెప్పింది. ఈలోపు మంటలు వ్యాపించడంతో పైఅంతస్థుల్లో వారు కిందకు దిగేందుకు మెట్లమార్గం మూసుకుపోయింది. దీంతో, కొందరు కిటికీల్లోంచి దూకే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కింద పడ్డ ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఘటనపై భారతీయ ఎంబసీ విచారం వ్యక్తం చేసింది. అతడి కుటుంబసభ్యులతో టచ్‌లో ఉన్నామని, వారికి కావాల్సిన అన్ని సహాయసహకారాలు అందిస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.


More Telugu News