మేడారం నుంచి తిరిగి వస్తూ బస్సులోనే మందేసిన భక్తులు.. వీడియో ఇదిగో!

  • గురువారం ఆర్టీసీ బస్సులో ఘటన.. వీడియో తీసి ట్వీట్ చేసిన ప్రయాణికుడు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఫన్నీగా రియాక్టవుతున్న నెటిజన్లు.. 
  • ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించాలని డిమాండ్
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడిపింది. అయితే, గురువారం జాతర నుంచి తిరిగి వస్తున్న ఓ బస్సులో ఐదుగురు ప్రయాణికులు మద్యం సేవించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. బస్సులో కింద కూర్చున్న ప్రయాణికులలో ఐదుగురు వ్యక్తులు మద్యంతో పార్టీ చేసుకున్నారు. మిగతా ప్రయాణికులు చూస్తుండగానే మద్యం తాగుతూ మత్తులో ఊగిపోయారు. ఈ తతంగాన్నంతా ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్వీట్ చేశాడు.

ట్విట్టర్ లో ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘జీడీపీ పెరిగేది ఇలానే. బస్ టికెట్ తీసుకుంటే రూ.100 తో అయిపోయేది. కానీ, మహిళలకు ఉచిత ప్రయాణంతో మగవాళ్లు మద్యం కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.1000 లాభం’ అని కామెంట్ పెట్టాడు. మరో యూజర్ మాత్రం.. ‘ఇలాంటి వాటిని ప్రభుత్వం లేదా ప్రభుత్వ పెద్దలు వచ్చి అడ్డుకోవాలా? వాళ్లను అడ్డుకోకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని తిట్టాలా? బలే లాజిక్ గురూ’ అంటూ మండిపడ్డాడు. వైరల్ గా మారిన ఈ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎలా స్పందిస్తారో చూడాలని ఉందంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ పెట్టారు.


More Telugu News