జగన్, అవినాశ్ రెడ్డి పులివెందులలో ఓట్లు అడిగితే జనాలు రాళ్లు వేస్తారు: వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి

  • జగన్, అవినాశ్ రెడ్డిలకు భయపడే ప్రసక్తే లేదన్న దస్తగిరి
  • గత ఎన్నికల్లో వివేకా హత్యను అడ్డుపెట్టుకుని గెలిచారని ఆరోపణ
  • కడప జైల్లో శివశంకర్ రెడ్డి, చైనత్య రెడ్డి తనకు డబ్బు ఆశ చూపారని వెల్లడి
అవసరమైతే చావడానికి కూడా సిద్ధమేకానీ... సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిలకు భయపడబోనని వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఎవరు చంపారో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. పులివెందులలో అవినాశ్ రెడ్డి ఇంటి పక్కనే తాను ఉంటానని... భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. వివేకా హత్య కేసుకు సంబంధించి తాను తప్పు చేశానని... ప్రాయశ్చిత్తంతోనే అప్రూవర్ గా మారానని తెలిపారు. జగన్, అవినాశ్ మాటలు విని మళ్లీ తప్పు చేయదలుచుకోలేదని చెప్పారు. అట్రాసిటీ కేసులో నాలుగు నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి నిన్న బెయిల్ పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కడప జైల్లో తనను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిశారని... డబ్బు ఆశ చూపి రాజీకి రావాలని కోరారని తెలిపారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభాలకు గురి చేశారని... అయినప్పటికీ తాను తలొగ్గలేదని చెప్పారు. గత ఎన్నికల్లో వివేకా హత్యను అడ్డం పెట్టుకుని గెలిచారని... ఇప్పుడు మళ్లీ అదే కుట్రతో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. 

వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారాననే... కుట్ర పన్ని, తప్పుడు కేసులు పెట్టి తనను జైలుకు పంపారని దస్తగిరి మండిపడ్డారు. జగన్, అవినాశ్ రెడ్డి పులివెందులలో ఓట్లు అడిగితే జనాలు రాళ్లు వేస్తారని చెప్పారు. మరోవైపు కడప జైలు నుంచి విడుదలైన దస్తగిరి పోలీసు బందోబస్తు మధ్య పులివెందులకు చేరుకున్నారు.


More Telugu News