నిన్నే పెళ్లాడతా అంటూ టీవీ చానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన మహిళ అరెస్ట్!

  • మ్యాట్రిమొనీలో యాంకర్ ప్రణవ్ పేరుతో నకిలీ ప్రొఫైల్
  • నిజమే అనుకుని చాటింగ్ చేసిన త్రిష అనే మహిళ
  • ప్రణవ్ ను ఎలాగైనా పెళ్లాడాలనుకుని కిడ్నాప్
  • తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రణవ్
హైదరాబాదులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీవీ యాంకర్ ప్రణవ్ ను పెళ్లాడాలన్న ఉద్దేశంతో త్రిష అనే మహిళ అతడిని కిడ్నాప్ చేసి, చివరికి పోలీసులకు పట్టుబడింది. ప్రణవ్ ఓ పాప్యులర్ టీవీ చానల్ లో యాంకర్ గా పనిచేస్తున్నాడు. త్రిష డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తోంది. ఆమె పలు స్టార్టప్ లకు యజమాని అని తెలుస్తోంది. 

అయితే, ఓ మ్యాట్రిమొనీ సంస్థలో ప్రణవ్ ఫొటోలు చూసి వ్యామోహానికి గురైన త్రిష... పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకోవాలని నిర్ణయించుకుంది. మ్యాట్రిమొనీలో వివరాల ఆధారంగా ప్రణవ్ ను అడగ్గా, అతడు పెళ్లికి తిరస్కరించాడు. ఈ క్రమంలో ఆమె ప్రణవ్ ఇష్టాయిష్టాలతో పనిలేకుండా, అతడిని కిడ్నాప్ చేసి పెళ్లాడాలని ప్రణాళిక రచించింది. 

ఈ నెల 10న ప్లాన్ ప్రకారం యాంకర్ ప్రణవ్ ను తన మనుషులతో కిడ్నాప్ చేయించి ఓ రూమ్ లో బంధించింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై అనేక విధాలుగా ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే, ప్రణవ్ ఎలాగోలా త్రిష చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్రిషను అరెస్ట్ చేశారు. 

అసలు విషయం ఏమిటంటే... మ్యాట్రిమొనీలో త్రిష చూసిన ప్రణవ్ ప్రొఫైల్ నకిలీది. చైతన్యరెడ్డి అనే యువకుడు ప్రణవ్ ఫొటో, వివరాలతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి త్రిషతో చాటింగ్ చేసినట్టు గుర్తించారు. అది నిజంగానే ప్రణవ్ ప్రొఫైల్ అని భావించిన త్రిష... అతడినే పెళ్లి చేసుకోవాలని కిడ్నాప్ వరకు వెళ్లింది. ఈ మేరకు వార్తా కథనాలు వచ్చాయి. 

అయితే, యాంకర్ ప్రణవ్ దీనిపై ఇన్ స్టాగ్రామ్ లో స్పందించాడు. మీడియాలో వస్తున్న వార్తల్తో కొంత మేర మాత్రమే నిజముందని, త్వరలో తన అధికారిక ప్రకటన విడుదల చేస్తానని వెల్లడించాడు.


More Telugu News