ఏపీలో వామపక్షాలతో ఎన్నికల పొత్తుపై చర్చించాం: షర్మిల

  • రాష్ట్రాల వారీగా ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు
  • ఏపీలో వామపక్ష నేతలతో చర్చించిన షర్మిల
  • కాంగ్రెస్ తోనే ఏపీకి మేలు జరుగుతుందని ఉద్ఘాటన  
విపక్ష ఇండియా కూటమి రాష్ట్రాల వారీగా సీట్ల సర్దుబాటు చేసుకుంటూ వస్తోంది. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్... తన మిత్ర పక్షాలతో వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై చర్చలు జరుపుతోంది. నేడు ఏపీలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... సీపీఐ, సీపీఎం అగ్రనేతలతో సమావేశం అయ్యారు. 

సీపీఐ నుంచి రామకృష్ణ, జల్లి విల్సన్, అక్కినేని వనజ, నాగేశ్వరరావు... సీపీఎం నుంచి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, గఫూర్ హాజరయ్యారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కూడా దృష్టిలో ఉంచుకుని, నేడు మిత్ర పక్షాలకు సీట్ల కేటాయింపుపై చర్చించారు. దీనిపై షర్మిల ట్వీట్ చేశారు. 

"ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు, ఉమ్మడి పోరాటం సాగించే అంశాలపై చర్చ జరిగింది. కలిసికట్టుగా పోరాటాలు చేస్తే ఏదైనా సాధ్యం. ఉమ్మడి కార్యాచరణ, సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు బీజేపీకి బానిసలుగా మారి మన హక్కులను కాలరాస్తున్నాయి. రాష్ట్రానికి మేలు జరగాలన్నా, విభజన హామీలు నెరవేరాలన్నా... అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం" అని షర్మిల స్పష్టం చేశారు.


More Telugu News