బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూతపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి

  • ప్రజామన్ననలు పొందిన లాస్య అకాల మరణం ఎంతో బాధాకరమన్న బీఆర్ఎస్ అధినేత
  • మంచి నాయకురాలిగా ఎదుగుతున్న లాస్య చనిపోవడం విషాదమన్న కేటీఆర్
  • ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ లాస్యను పరామర్శించిన కేటీఆర్
  • శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో చనిపోయిన లాస్య నందిత
యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత మృతి చెందడం తనను కలచివేస్తోందని కేసీఆర్ విచారంం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘చిన్న వయసులోనే ప్రజామన్ననలు పొందిన లాస్య అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. శోక సంద్రంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారం క్రితమే లాస్యను పరామర్శించానని, ఇప్పుడు ఆమె లేకపోవడం విషాదకరమని వ్యాఖ్యానించారు. ‘‘ఈ విషాదకరమైన, కష్టకాలాన్ని తట్టుకునేలా ఆమె కుటుంబం సభ్యులు, స్నేహితులకు శక్తి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని అన్నారు. మంచి నాయకురాలిగా ఎదుగుతున్న లాస్య నందిత చనిపోయిందనే వార్తను ఉదయం లేవగానే తెలిసిందని వెల్లడించారు. కాగా  లాస్య ఇక లేరనే అత్యంత విషాదకరమైన, షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలిసిందని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడ్డ ఆమెను కేటీఆర్ స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ ఫొటోను ఈ సందర్భంగా కేటీఆర్ షేర్ చేశారు. 

కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. కారు రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


More Telugu News