మెట్రో రైలు విస్తరణ... జపాన్ తో రేవంత్ ప్రభుత్వం సంప్రదింపులు

  • ఆరు మార్గాల్లో 70 కి.మీ. మేర మెట్రో విస్తరణ పనులు
  • ప్రాథమిక అంచనా వ్యయం రూ. 17,500 కోట్లు
  • దీర్ఘకాల రుణం కోసం జైకాతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పనులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొత్తం ఆరు మార్గాల్లో 70 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులను చేపడుతోంది. ఈ పనులకు భారీగా నిధుల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా)తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. 

ప్రాథమిక అంచనాల ప్రకారం మెట్రో విస్తరణ పనులకు రూ. 17,500 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం, కేంద్ర ప్రభుత్వం 15 శాతం నిధులను వెచ్చిస్తాయి. మిగిలిన 50 శాతం నిధులను రుణాల రూపంలో సమకూర్చుకుంటారు. అయితే, ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మోడల్ వైపు మొగ్గు చూపుతోంది. 50 శాతంలో 5 శాతాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)కు అవకాశం ఇవ్వబోతోంది. మిగిలిన 45 శాతం నిధులను దీర్ఘకాలానికి రుణం తీసుకోవాలని యోచిస్తోంది. 

ఈ క్రమంలో జైకా ఇండియా చీఫ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. చెన్నై, ముంబై, కోల్ కతా, ఢిల్లీ, బెంగళూరు, పాట్నా, అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులకు కూడా జైకా రూ. 1.07 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసింది. జైకా ఇచ్చే రుణాలకు వడ్డీ 2, 3 శాతానికి మించదని అధికారులు చెపుతున్నారు.


More Telugu News