మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కన్నుమూత

  • మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలు అందించిన మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం
  • టీచర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వైనం
  • శుక్రవారం మధ్యాహ్నం ముంబైలో జరగనున్న అంత్యక్రియలు
మహారాష్ట్ర మాజీ  సీఎం మనోహర్‌ జోషి కన్నుమూశారు. 86 ఏళ్ల వయసున్న ఆయన రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. ముంబయిలోని పీడీ హిందుజా హాస్పిటల్ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని గురువారం సాయంత్రమే రిపోర్టులు వెలువడ్డాయి. అంతలోనే ఆయన చనిపోయారంటూ ప్రకటన వెలువడింది. కాగా గతేడాది మే నెలలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మెదడులో రక్తస్రావం కావడంతో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందారు. కాగా శుక్రవారం (ఈ రోజు) మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి. 

సీఎంగా, లోక్‌సభ స్పీకర్‌గా సేవలు..
మనోహర్‌ జోషి శివసేన పార్టీలో అగ్రస్థాయి నేతగా ఎదిగారు. అంచెలంచెలుగా ఎదిగి 1995 నుంచి 1999 మధ్యకాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఇక మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో 2002-2004 కాలంలో లోక్‌సభ స్పీకర్‌గానూ పనిచేశారు.

మనోహర్ జోషి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 1937 డిసెంబర్‌ 2న నాంద్వీలో జోషి జన్మించారు. ఆయన ముంబైలో చదువుకున్నారు. ఆయన భార్య అనఘ మనోహర్‌ జోషి 2020లో కన్నుమూశారు. ఆయనకు ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. . తొలినాళ్లలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1967లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1968-70 మధ్య మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలిచారు. స్టాండింగ్‌ కమిటీ (మున్సిపల్‌ కార్పొరేషన్‌) ఛైర్మన్‌గానూ ఎంపికయ్యి సేవలు అందించారు. 1967-77 మధ్యకాలంలో ముంబై మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 1972లో మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశాక 1990లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 1990-91 మధ్యకాలంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున పోటీ చేసి ముంబయి నార్త్‌-సెంట్రల్‌ సీటు నుంచి ఎంపీగా విజయం గెలిచారు.


More Telugu News