మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు

  • వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా కూర్చోవాల్సి ఉంటుందన్న ధర్మాన
  • సాక్ష్యాధారాలతో ఈసీ దృష్టికి తీసుకెళ్లిన అచ్చెన్నాయుడు
  • ఈసీ ఆదేశాలను ధర్మాన ఉల్లంఘించారని ఫిర్యాదు 
అవసరమైతే వాలంటీర్లు ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కూర్చోవాల్సి ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. 

ధర్మాన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండరాదన్న ఆదేశాలను మంత్రి ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. 

80 ఏళ్లకు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నారని, వాళ్లతో ఓటేయించే విషయంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషించాలని ధర్మాన ప్రసాదరావు నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. 

వాలంటీర్లకు సర్వీస్ రూల్స్ ఏవీ లేవని, వారు బూత్ ఏజెంట్లుగా ఉండేందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అన్నారు. ఎవరికి ఓటు వేయాలో చెప్పాల్సింది మీరే కదా అంటూ వాలంటీర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


More Telugu News