ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ఆంధ్రా కుర్రాడు.. బీసీసీఐ అలెర్ట్.. వీడియో ఇదిగో!

  • కల్నల్ సీకేనాయుడు ట్రోఫీలో చెలరేగిన ఆంధ్రా కుర్రాడు వంశీకృష్ణ
  • కడపలో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం
  • 64 బంతుల్లో 110 పరుగులు చేసిన వంశీకృష్ణ
  • వీడియోను పంచుకున్న బీసీసీఐ
ఆట అన్నాక రికార్డులు సహజం. రికార్డులన్నాక బద్దలు కావడం కూడా సహజమే. అప్పుడెప్పుడో టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి రంజీల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది రికార్డు క్రియేట్ చేశాడు. 1985లో బాంబేకు ప్రాతినిధ్యం వహించిన రవి బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతులను స్టాండ్స్‌లోకి తరలించి ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. కొన్ని దశాబ్దాలపాటు అది భద్రంగా ఉంది. దానిని బద్దలుగొట్టడం అసాధ్యమని క్రికెట్ పండితులు నిర్ణయానికి వచ్చిన వేళ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగులో యువరాజ్ సింగ్ ఆరు బంతులను స్టాండ్స్‌లోకి పంపి అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 

1968లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడిన విండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్ గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాల్కమ్ నాష్ బౌలింగులో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా సౌతాఫ్రికా బ్యాటర్ హర్షలే గిబ్స్ పేరు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఇప్పుడీ జాబితాలోకి తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వంశీకృష్ణ వచ్చి చేరాడు. 

అండర్-23 జాతీయ టోర్నీ అయిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో వంశీకృష్ణ ఈ ఘనత సాధించాడు. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన బీసీసీఐ.. అలెర్ట్ అంటూ రాసుకొచ్చింది. కడపలో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ బౌలింగులో వంశీకృష్ణ ఆరు సిక్సర్లు బాదాడని పేర్కొంది. ఈ మ్యాచ్‌లో వంశీకృష్ణ 64 బంతుల్లోనే 110 పరుగులు చేసినట్టు పేర్కొంది.


More Telugu News