రాంచీ టెస్ట్ ఆరంభానికి ఒక రోజు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

  • భారతీయ పిచ్‌ల మాదిరిగా కనిపించడంలేదని బెన్‌ స్టోక్స్ వ్యాఖ్య
  • దూరం నుంచి పచ్చగా ఉందని.. దగ్గరికి వెళ్తే నల్లగా, పగుళ్లు ఉన్నాయన్న ఇంగ్లండ్ కెప్టెన్
  • కాబట్టి పిచ్‌పై ఎలాంటి అభిప్రాయం లేదని వ్యాఖ్య
భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి కీలకమైన 4వ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఝార్ఖండ్‌లోని రాంచీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఆరంభానికి ఒక రోజు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పిచ్‌ను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని, ఇండియన్ పిచ్‌లా అనిపించడంలేదని అన్నాడు. కాబట్టి పిచ్‌పై తనకు ఎలాంటి అభిప్రాయంలేదని స్టోక్స్ పేర్కొన్నాడు. 

పిచ్‌ను గమనిస్తే ఇదివరకు చూసిన పిచ్‌లకు భిన్నంగా కనిపించిందని, భారతీయ పిచ్‌లకు విభిన్నంగా కనిపిస్తోందని, కాబట్టి ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చెప్పలేనని స్టోక్స్ అన్నాడు. పచ్చగా, పచ్చికగా ఉన్నట్టు కనిపించిందని, కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అందుకు భిన్నంగా కనిపించిందని అన్నాడు. పిచ్ నల్లగా ఉందని, పిచ్‌పై కొన్ని పగుళ్లు ఉన్నాయని పేర్కొన్నాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌‌ఇన్ఫోతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ఇక ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఒల్లీ పోప్ స్పందిస్తూ..  పిచ్ సగం చాలా రఫ్‌గా ఉన్నట్టు కనిపిస్తోందని, భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కలిసి రావొచ్చని పోప్ పేర్కొన్నాడు. సగ భాగం పిచ్ బాగానే ఉందని, పిచ్‌‌పై పగుళ్లు ఉన్నాయని అన్నాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఆఫ్-స్టంప్ వెలుపల పిచ్ రఫ్‌గా ఉందని అన్నాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఒల్లీ పోప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వికెట్‌ను పరిశీలించిన తర్వాత ఏం చెబుతారో చూడాలని అన్నాడు.

కాగా రాంచీ టెస్టులో ఫలితం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కాగా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు జరగగా 2 - 1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. అందుకే నాలుగవ టెస్ట్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలని భారత్, ఎలాగైనా సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లండ్ ఉవ్విళ్లూరుతున్నాయి.


More Telugu News