ఎన్నికల టార్గెట్ క్లియర్ గా ఉంది.. రాబోయే 50 రోజులు ఇదే పని మీద ఉండాలి: సజ్జల

  • చంద్రబాబును రాజకీయాల నుంచి తరిమేసేందుకు సమయం ఆసన్నమయిందన్న సజ్జల
  • ఓటర్లను పోలింగ్ బూత్ ల వద్దకు తీసుకెళ్లి బటన్లు నొక్కించాలని కేడర్ కు సూచన
  • 2019 వరకు చంద్రబాబు ఎన్నో అరాచకాలు చేశారని విమర్శ
రాష్ట్రానికి ఏమీ చేయలేని చంద్రబాబుకు ఓటు వేయాలా? లేక సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ కు వేయాలా? అనే విషయాన్ని ప్రజలు తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబును రాజకీయాల నుంచి తరిమేసేందుకు సమయం ఆసన్నమయిందని చెప్పారు. మన ముందు ఎన్నికలకు సంబంధించిన టార్గెట్ క్లియర్ గా ఉందని... పరీక్షలు రాసే పిల్లల్లా వైసీపీ గెలుపు కోసం పని చేయాలని... రాబోయే 50 రోజులు ఇదే పని అని చెప్పారు. వైసీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కేడర్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 

ఓటర్లను పోలింగ్ బూత్ ల వద్దకు తీసుకెళ్లి అసెంబ్లీకి ఒక బటన్, లోక్ సభకు రెండో బటన్ నొక్కించాలని సజ్జల చెప్పారు. ఓట్ల కోసం జగన్ పథకాలను రూపొందించలేదని... సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రంగా ఏపీని తీర్చి దిద్దడమే సీఎం లక్ష్యమని అన్నారు. అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యతను ఇస్తున్నారని... కొన్ని కులాల్లో నాయకులు దొరకని పరిస్థితి ఉందని చెప్పారు. వైసీపీ డీఎన్ఏలోనే మైనార్టీలు ఉన్నారని అన్నారు. అవకాశం ఉన్న ప్రతి చోటా మైనార్టీలకు చోటు కల్పించామని చెప్పారు. 

2019 వరకు చంద్రబాబు ఎన్నో అరాచకాలు చేశారని సజ్జల విమర్శించారు. ఆ అరాచకాలను భరించలేకే ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని అన్నారు. అనారోగ్య కారణాలతో జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు... తాను యువకుడినంటూ ఇప్పుడు ఊర్లలో తిరుగుతున్నారని విమర్శించారు. 


More Telugu News