చీటికిమాటికి పారాసిటమాల్ అదేపనిగా వాడుతున్నారా.. ఈ విషయం తెలిస్తే జాగ్రత్త పడతారు!

  • రోజుకు నాలుగు గ్రాముల డోసు మించి వాడితే ప్రమాదం
  • కాలేయానికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తల హెచ్చరిక
  • కాలేయం, ఇతర అవయవాల మధ్యనున్న కణజాలాన్ని దెబ్బతీస్తున్న ఔషధం
పారాసిటమాల్.. దాదాపు అందరి ఇళ్లలోనూ ఉండే మాత్ర ఇది. జ్వరం తగ్గించడంతోపాటు చిన్నచిన్న నొప్పులను వెంటనే తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే ఔషధం ఇది. దీని పనితీరు అమోఘమే అయినా నిపుణులు మాత్రం దాని వాడకంపై హెచ్చరికలు జారీచేశారు. దీనిని అదేపనిగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. ఎడిన్‌బరో యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో విస్తుపోయే విషయం ఒకటి వెల్లడైంది. ఎలుకలకు అదే పనిగా పారాసిటమాల్ ఇస్తూ వాటిలో కలిగే మార్పులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలేయం దెబ్బతిన్నట్టు గుర్తించారు. పారాసిటమాల్‌ను అధికమోతాదులో తీసుకునే రోగుల్లోనూ ఇదే ఫలితం కనిపిస్తుందని హెచ్చరించారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్నవారు రోజుకు 4 గ్రామల వరకు పారాసిటమాల్ తీసుకోవడం వరకు ఓకే అని, కానీ అంతకుమించి తీసుకుంటే మాత్రం ఆరోగ్యాన్ని పణంగాపెట్టడమే అవుతుందని తెలిపారు. 

పారాసిటమాల్ డ్రగ్ అవయవాల్లోని కీలకమైన నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాలేయం, ఇతర అవయవాలకు మధ్యనున్న కణజాలాన్ని పారాసిటమాల్ దెబ్బతీస్తున్నట్టు పరిశోధనలో వెల్లడైనట్టు పేర్కొన్నారు. పారాసిటమాల్ కారణంగా కాలేయం దెబ్బతింటుందని గుర్తించిన మొదటి అధ్యయనం ఇదే. ఎడిన్‌బరో యూనివర్సిటీతోపాటు ఓస్లో, స్కాటిష్ నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సర్వీస్ పాల్గొన్న ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


More Telugu News