పార్లమెంటు ఎన్నికల వేళ వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి గుడ్‌బై!

  • ఇప్పటికే పార్టీని వీడిన ముగ్గురు ఎమ్మెల్యేలు
  • నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎండీ ఖలీల్ నియామకం
  • తనకు కనీస సమాచారం లేదని మనస్తాపం
  • నేడో, రేపో పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
లోక్‌సభ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పగా, తాజాగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎండీ ఖలీల్‌ను జగన్ నియమించారు. ఈ విషయంలో తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో వేమిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలో పార్టీని వీడాలని వేమిరెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. నేడో, రేపో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితోపాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అనంతరం భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని ఆయన అనుచరులు తెలిపారు. కాగా, రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని గతంలో వేమిరెడ్డి ప్రకటించారు. అయితే, ఆ తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో తనకు టికెట్ దక్కే అవకాశం లేదని భావించి పార్టీ మార్పుకు సిద్ధమైనట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.


More Telugu News