మేడారం జాతర... గద్దెపై కొలువుదీరిన జంపన్న

  • ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క-సారలమ్మ జాతర
  • కన్నెపల్లి నుంచి జంపన్నను తీసుకువచ్చిన పూజారి
  • మూడ్రోజుల పాటు పూజలు అందుకోనున్న జంపన్న
తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహా జాతర రేపు ప్రారంభం కానుంది. ఈ సమ్మక్క-సారలమ్మ జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు.  

కాగా, ఆచారం ప్రకారం సమ్మక్క తనయుడు జంపన్న గద్దెపైకి చేరుకున్నాడు. కన్నెపల్లిలో కొలువైన జంపన్నను సంప్రదాయబద్ధంగా సంపెంగ వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి తీసుకువచ్చారు. కర్ర, డాలును జంపన్నకు ప్రతిరూపంగా కొలుస్తారు. మూడ్రోజుల పాటు భక్తుల పూజలు అందుకోనున్న జంపన్నను తిరిగి శనివారం నాడు కన్నెపల్లి తీసుకురానున్నారు. 

తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.


More Telugu News