14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా సొంత నియోజకవర్గానికి నీరు అందించలేకపోయారు: చంద్రబాబుపై పెద్దిరెడ్డి విమర్శలు

  • సొంత నియోజకవర్గానికే చంద్రబాబు ఏమీ చేయలేదని పెద్దిరెడ్డి విమర్శ
  • ఎలాంటి అభివృద్ధి చేయలేదనే విషయం కుప్పం ప్రజలకు కూడా తెలుసని వ్యాఖ్య  
  • కుప్పంకు నీరు అందించాలనే లక్ష్యంతో జగన్ పని చేశారని కితాబు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. సొంత నియోజకవర్గం కుప్పంకే ఏమీ చేయలేని చంద్రబాబు... జిల్లాకు ఏం చేసి ఉంటారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా సొంత నియోజకవర్గానికి నీరు అందించలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదనే విషయం కుప్పం ప్రజలకు కూడా తెలుసని అన్నారు. 

కుప్పంకు నీరు అందించాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి జగన్ పని చేశారని పెద్దిరెడ్డి కొనియాడారు. ఇప్పటికే హంద్రీనీవా జలాలు కుప్పం నియోజకవర్గంలోకి వచ్చాయని... వచ్చే ఏడాది కుప్పం ప్రజలకు పుష్కలంగా నీరు అందుతుందని చెప్పారు. అన్నా క్యాంటీన్ అని చెప్పి పది మందికి ట్రాక్టర్ లో తీసుకొచ్చిన భోజనం పెడుతున్నారని... ఇలాంటి క్యాంటీన్ లు ఉన్నా ఒకటే, లేపోయినా ఒకటేనని ఎద్దేవా చేశారు. తాము రాజన్న క్యాంటీన్ పేరుతో ఎంత మంది వచ్చినా భోజనం అందిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పెద్దిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News