అతడు రూ.2,800 కోట్ల జాక్ పాట్ కొట్టాడు.... తూచ్ అన్న లాటరీ కంపెనీ!

  • అమెరికాలో ఆసక్తికర ఘటన
  • పవర్ బాల్ లాటరీ జాక్ పాట్ కొట్టిన జాన్ చీక్స్
  • పొరపాటున అతడి నెంబర్లు ప్రచురించామన్న కంపెనీ
  • టికెట్ తీసుకెళ్లి చెత్తబుట్టలో వేసుకోవాలన్న కంపెనీ ఏజెంట్
  • కోర్టును ఆశ్రయించిన జాన్ చీక్స్
అమెరికాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్ డీసీకి చెందిన జాన్ చీక్స్ అనే వ్యక్తికి రూ.2,800 కోట్ల జాక్ పాట్ తగిలింది. అయితే లాటరీ వచ్చింది అతడి నెంబర్లకు కాదని, పొరబాటున అతడి నెంబర్లు ప్రచురించారని సదరు లాటరీ కంపెనీ ప్రకటించింది. 

జాన్ చీక్స్ గతేడాది జనవరి 6న పవర్ బాల్ అండ్ డీసీ లాటరీ టికెట్ కొన్నాడు. మొదట జాన్ చీక్స్ వద్ద ఉన్న లాటరీ టికెట్ నెంబరుకు లాటరీ తగిలిందన్న కంపెనీ... ఆ తర్వాత మరో ప్రకటన చేసింది. అయితే, జాన్ చీక్స్ మాత్రం ఒప్పుకోవడంలేదు. తానే లాటరీ విజేతనని, తనకు రూ.2,800 కోట్లు చెల్లించాల్సిందేనని అంటున్నాడు. 

ఈ క్రమంలో జాన్ చీక్స్ తన లాటరీ టికెట్ తో లాటరీ అండ్ గేమింగ్ కార్యాయంలో ఫిర్యాదు చేయగా, అతడి ఫిర్యాదును సదరు సంస్థ తిరస్కరించింది. అతడి టికెట్ సరైనది కాదని, విజేతగా అతడి లాటరీ టికెట్ చెల్లుబాబు కాదని, అందుకే లాటరీ తిరస్కరించామని సదరు కంపెనీ వివరణ ఇచ్చిందని లాటరీ అండ్ గేమింగ్ కార్యాలయం తెలిపింది. 

అంతేకాదు, లాటరీ కంపెనీ ఏజెంట్ ఒకరు తన పట్ల ప్రవర్తించిన తీరుతో జాన్ చీక్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇక నీ టికెట్ చెల్లదు... తీసుకెళ్లి చెత్తబుట్టలో వేయి... అదిగో చెత్తబుట్ట అక్కడుంది అని ఆ ఏజెంట్ హేళనగా మాట్లాడాడని వివరించాడు. 

కాగా, లాటరీ కంపెనీ తీరు పట్ల మండిపడుతున్న జాన్ చీక్స్... ఎనిమిది వేర్వేరు అభియోగాలతో సదరు లాటరీ కంపెనీపై దావా వేశాడు. వడ్డీతో కలిపి తనకు రూ.2,800 కోట్లకు పైగా నగదు రావాలని, ఆ మేరకు లాటరీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాడు.


More Telugu News