ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను ఎలా అనుమతిస్తారు?: ఏపీ హైకోర్టు

  • 6,100 టీచర్ పోస్టులలో డీఎస్సీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అనుమతి
  • ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు
  • నేడు విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం
ఇటీవల ఏపీ ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులతో డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై ఏపీ హైకోర్టులో  పిటిషన్లు  దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ నేడు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 

వాదనల సందర్భంగా... ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎస్జీటీ పోస్టులకు తీవ్రమైన పోటీ నెలకొంటుందని, డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. 

రాష్ట్ర ప్రభుత్వ తాజా రిక్రూట్ మెంట్ ఎన్ సీఈటీ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నారని తెలిపారు. 

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... రాష్ట్రంలో ఎస్జీటీ అభ్యర్థులు తక్కువగా ఉన్నందునే బీఈడీ అభ్యర్థులను అనుమతించాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు. ఎస్జీటీ పోస్టులకు అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులు రెండేళ్ల బ్రిడ్జి కోర్సు చేసిన తర్వాతే బోధనకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. 

ఈ దశలో హైకోర్టు స్పందించింది. అసలు, బ్రిడ్జి కోర్సుకు చట్టబద్ధత ఏముందని సూటిగా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని నిలదీసింది. 

అంతేకాదు, డీఎస్సీ నోటిఫికేషన్ పై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు సిద్ధపడగా, ప్రభుత్వం నుంచి వివరణ కోరేందుకు ఒక్క రోజు సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టును కోరారు. ఏజీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.


More Telugu News