తెలంగాణ కళాశాలలో 15% ప్రవేశాలను వదులుకోవడం అనాలోచిత చర్య: దేవినేని ఉమా

  • విభజన చట్టం మేరకు ఏపీ స్థానికత కలిగిన విద్యార్థులకు 15 శాతం ప్రవేశాలు దక్కుతున్నాయన్న ఉమా 
  • గడువు పొడిగింపు ప్రయత్నాలు చేయలేదని విమర్శ 
  • విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ ఆటలాడుతున్నారని ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీరుతో రాష్ట్ర విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకుండానే ఉమ్మడి రాష్ట్ర కోటా ప్రవేశాలను వదులుకోవాలని ఎలా నిర్ణయిస్తారని జగన్ పై మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీ మేరకు తెలంగాణలోని కాలేజీలలో ఏపీ స్థానికత కలిగిన విద్యార్థులకు 15 శాతం ప్రవేశాలు దక్కుతున్నాయి. విభజన తర్వాత ఈ హామీ పదేళ్ల పాటు అమలులో ఉండేలా ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ గడువు ముగియనుండగా.. దానిని పొడిగించేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని దేవినేని ఉమా ఆరోపించారు.

పైపెచ్చు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకముందే.. ఉమ్మడి రాష్ట్ర వాటా ప్రవేశాలను వదులుకుంటున్నట్లు జగన్ ప్రకటించారని చెప్పారు. ఏపీ విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. ఈమేరకు దేవినేని స్పందిస్తూ.. ‘తెలంగాణ కళాశాలలో 15% ప్రవేశాలను వదులుకోవడం అనాలోచిత చర్య. వైసీపీ సర్కార్ తీరుతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువులకు చెదలు. నాడు స్వప్రయోజనాల కోసం లక్షల కోట్ల ఉమ్మడి ఆస్తులను అప్పజెప్పారు. నేడు విద్యార్థుల అవకాశాలను నాశనం చేస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News