ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’.. ఇండియాలో కొంపముంచిందా?

  • బజ్‌బాల్ వ్యూహంతో ఇండియాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్
  • తొలి టెస్టులో విజయంతో ఆ వ్యూహం పనిచేసిందనే వ్యూహంలో పర్యాటక జట్టు
  • ఆ తర్వాతి రెండు టెస్టుల్లో దారుణ ఓటమి
  • ఇండియాలో ఆ వ్యూహం ఎందుకు పనిచెయ్యదో చెప్పిన టీమిండియా మాజీ క్రికెటర్
‘బజ్‌బాల్’ వ్యూహంతో ఇండియాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా కాళరాత్రి మిగిల్చింది. వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి ఇంగ్లిష్ జట్టు బజ్‌బాల్ వ్యూహాన్ని తిప్పికొట్టింది. భారత గడ్డపై అలాంటి వ్యూహాలు ఎందుకూ కొరగాకుండా పోతాయని చెప్పకనే చెప్పింది. మూడో టెస్టులో పర్యాటక జట్టు 434 పరుగుల భారీ తేడాతో ఓడిన తర్వాత బజ్‌బాల్ ఆటపై సమీక్షకు సిద్ధమవుతోంది.

జూన్ 2022లో లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఈ బజ్‌బాల్‌ను తెరపైకి తెచ్చింది. కెప్టెన్ బెన్‌స్టోక్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కలిసి ఈ వ్యూహాన్ని అమలు చేసి విజయం సాధించారు. కివీస్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని దూకుడుగా ఆడుతూ ఇంగ్లండ్ ఛేదించింది. ఇదే వ్యూహాన్ని భారత్‌పైనా ప్రయోగించాలని భావించిన ఇంగ్లండ్ బొక్కబోర్లా పడింది. 

రాజ్‌కోట్ మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన టీమిండియా మాజీ లెఫ్టార్మ్ సీమర్ కర్సన్ ఘవ్రీ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ బజ్‌బాల్ తన సొంతగడ్డపైన కానీ, లేదంటే ఆస్ట్రేలియా పైన కానీ పనికొస్తుందని, ఇండియా పిచ్‌లపై అది విషాదాన్నే మిగులుస్తుందని పేర్కొన్నాడు.

ఫ్లాట్ వికెట్‌పై మాత్రమే బజ్‌బాల్ వ్యూహం పనికొస్తుందని చెప్పాడు. టర్నింగ్ ట్రాక్‌పై అది ఎంతమాత్రమూ సురక్షితం కాదన్నాడు. టెస్ట్ క్రికెట్ అనేది చాలా గొప్పదని, పరుగులు సాధించడంపైనే ఆటగాడి నైపుణ్యం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. బజ్‌బాల్ క్రికెట్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలోనే పనికొస్తుందని, ఇండియా లాంటి ఫ్లాట్ పిచ్‌లపై అది పనిచెయ్యదని వివరించాడు. హైదరాబాద్ టెస్టులో 28 పరుగుల విజయం బజ్‌బాల్ ద్వారా సాధించినదేనని, ఇండియాలోనూ బజ్‌బాల్ వ్యూహం పనిచేస్తుందని భావించిందని, కానీ అది పూర్తిగా తప్పని ఘవ్రీ అభిప్రాయపడ్డాడు.


More Telugu News