ఊగిపోయిన ఇండిగో విమానం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు

  • భారీ వర్షానికి తోడు విపరీతంగా కురిసిన మంచు
  • విమానం ఊగుతుంటే కుర్చీలను గట్టిగా పట్టుకున్న ప్రయాణికులు
  • తమకు పునర్జన్మ లభించిందన్న కశ్మీర్ సేవా సంఘ్ చీఫ్ బాబా ఫిర్దౌస్
  • కొండచరియలు విరిగిపడడంతో జాతీయ రహదారుల మూసివేత
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమాన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. విమానం గాలిలో ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండిగో విమానం 6ఈ6125 నిన్న సాయంత్రం 5.25 గంటలకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయల్దేరింది. ఆ తర్వాత కాసేపటికే భారీ వర్షం కారణంగా విమానం ఊగిపోయింది.  విమానం చిగురుటాకులా ఊగుతుండగా ప్రయాణికులు కుర్చీలను గట్టిగా పట్టుకోవడం కనిపించింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న కశ్మీర్ సేవా సంఘ్ చీఫ్ బాబా ఫిర్దౌస్ మాట్లాడుతూ.. తనతోపాటు విమానంలోని అందరికీ పునర్జన్మ లభించిందని పేర్కొన్నారు. 

జమ్మూ కశ్మీర్ సహా నిన్న పలుప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. మరోపక్క, మంచు భారీగా కురిసింది. ఫలితంగా కొండచరియలు విరిగిపడడంతో జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ముందుజాగ్రత్త చర్యగా అంతర్రాష్ట్ర రహదారులను మూసివేశారు. దీంతో వందలాదిమంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.


More Telugu News