కోహ్లీ, రోహిత్‌లా హీరో అయ్యేవాడిని.. నన్ను ఎందుకు తప్పించారో ధోనీని అడగాలనుకుంటున్నా: మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు

  • క్రికెట్ కెరియర్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ
  • 2011లో సెంచరీ చేసినా తుది జట్టు నుంచి పక్కన పెట్టారని ఆవేదన
  • రంజీ ట్రోఫీలో బీహార్‌పై చివరి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఆటగాడు
రంజీట్రోఫీలో బీహార్‌పై బెంగాల్ తరపున చివరి మ్యాచ్ ఆడి క్రికెట్ కెరియర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ ఆటగాడు, మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2011లో సెంచరీ చేసిన తర్వాత కూడా తుది జట్టు నుంచి తనను ఎందుకు తప్పించారో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని అడగాలనుకుంటున్నానని మనోజ్ తివారీ అన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాగా హీరో అయ్యే సత్తా తనకు ఉందని, కానీ తాను అలా కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రోజుల్లో చాలా మంది మాజీ క్రికెటర్లకు టీవీల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని, ఈ విషయంలో తనకు బాధగా ఉందని విచారం వ్యక్తం చేశాడు. బీహార్‌తో చివరి మ్యాచ్ ముగిసిన అనంతరం కోలకతా స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ క్లబ్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో మనోజ్ తివారీ మాట్లాడాడు.

 ఐపీఎల్ కేంద్రంగా ఆటగాళ్లను నిర్ణయించడంపై మనోజ్ తివారీ ఆందోళన వెలిబుచ్చాడు. యువ క్రికెటర్లు ఐపీఎల్‌ను ప్రాధాన్యంగా భావిస్తుండడాన్ని తాను గమనించానని అన్నాడు. ఐపీఎల్ ఆడని వారు కొంత ఖాళీ సమయం దొరికినప్పుడల్లా దుబాయ్ లేదా ఇతర ప్రదేశాలకు వెళ్లి ఆడుతుంటారని, అయితే ఈ ధోరణి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ప్రాముఖ్యతను తగ్గిస్తుందని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తాను ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే నిషేధానికి కూడా దారితీయవచ్చునని మనోజ్ తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో కేవలం ఒక పోస్ట్ పెట్టినందుకు తన మ్యాచ్ ఫీజులో 20 శాతం తగ్గింపుతో ఇప్పటికే జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా రంజీ ట్రోఫీని రద్దు చేయాలంటూ మనోజ్ తివారీ ఇటీవలే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఇందుకు గల కారణాలను వివరించలేదు. దీంతో మ్యాచ్‌ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు.

కాగా బీసీసీఐని ప్రస్తుతం రాజకీయ నాయకులు నడుపుతున్నారని, క్రీడాకారులు కాదని మనోజ్ తివారీ ఆరోపించాడు. ఈ విషయంపై తాను ఇంతకుముందు మాట్లాడగలిగానని, బీసీసీఐని ఇకపై ఆటగాళ్లు పాలించరని, రాజకీయ నాయకులతో  నడిపిస్తారని అన్నాడు. తనకు కూడా రాజకీయ పార్టీతో సంబంధం ఉందని, అయితే తాను క్రీడాకారుడినని అన్నాడు. రంజీ ట్రోఫీకి ప్రాధాన్యత ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని, ఎందుకంటే ఈ ట్రోఫీ క్రమంగా ప్రాముఖ్యతను కోల్పోతోందని మనోజ్ తివారీ ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా మనోజ్ తివారీ 19 ఏళ్లపాటు బెంగాల్‌ తరపున క్రికెట్ ఆడాడు. బెంగాల్ జట్టుకు నాయకత్వం వహించాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. ఇక టీమిండియా తరపున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.


More Telugu News