యశస్వి జైస్వాల్‌ సహా యంగ్ స్టార్స్‌‌ను ఉద్దేశిస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టా స్టోరీ.. వైరల్

  • ‘ఈ రోజు పిల్లలు’ అంటూ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌పై హిట్‌మ్యాన్ ప్రశంసలు
  • ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ముగ్గురి ఫొటోలు షేర్ చేసి రాజ్‌కోట్ గెలుపు విజయాన్ని పంచుకున్న టీమిండియా కెప్టెన్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రోహిత్ శర్మ పోస్ట్
రాజ్‌కోట్ వేదికగా మూడవ టెస్టు మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రాత్మకమైన విజయం సాధించడంలో యంగ్ స్టార్స్ ఎంత కీలక పాత్ర పోషించారో తెలిసిందే. యశస్వి జైస్వాల్ వరుసగా రెండవ డబుల్ సెంచరీ బాదగా.. అరంగేట్ర మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ కూడా శెభాశ్ అనిపించుకున్నారు. ఇంగ్లండ్‌కు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో కీలక పాత్ర పోషించిన ఈ యువగాళ్లపై ప్రశంసల జల్లు కురిసింది. ఇక ఈ యంగ్ స్టార్స్ ఆటను ప్రత్యక్షంగా మైదానంలో వీక్షించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరింత మురిసిపోతున్నాడు. యువ ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కూడా స్పందించాడు.

యశస్వి జైస్వాల్ తన డబుల్ సెంచరీని సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోని, ధ్రువ్ జురెల్ రనౌట్ కోసం ప్రయత్నిస్తున్న ఫొటోని జత కలిపి రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశాడు. ‘వీళ్లు నేటి కాలం పిల్లలు’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. నమస్కరిస్తున్న ఒక ఎమోజీని కూడా జోడించాడు. మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువఆటగాళ్లకు అంకితం ఇస్తూ, వారిని ప్రోత్సహిస్తూ రోహిత్ శర్మ పోస్ట్ పెట్టారంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. 

కాగా రాజ్‌కోట్ మ్యాచ్ అనంతరం కూడా యువ ఆటగాళ్లపై రోహిత్ శర్మ ప్రశంసలు జల్లు కురిపించిన విషయం తెలిసిందే. సర్ఫరాజ్ ఖాన్ ఏం చేయగలడో మొదటి ఇన్నింగ్స్‌లో చూశామని, జడేజాతో కలిసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడని మెచ్చుకున్నాడు. లెఫ్ట్ హ్యాండ్-రైట్ హ్యాండ్ కాంబినేషన్ రాణించాలని ఆశించామని, సర్ఫరాజ్ ఖాన్ చేసి చూపించాడని రోహిత్ అన్నాడు. ఇక యశస్వి జైస్వాల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని, తన క్రికెట్ కెరియర్‌ను గ్రాండ్‌గా మొదలుపెట్టాడని కితాబునిచ్చిన విషయం తెలిసిందే. కాగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి సీనియర్ల  గైర్హాజరీతో సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ వంటి యంగ్ స్టార్స్‌కు అవకాశం లభించిన విషయం తెలిసిందే.


More Telugu News