ఈ రెండు చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆపిల్ ను కోరుతున్నాం: కేంద్రం

  • భారత్ లో విపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారన్న ఆపిల్
  • గతేడాది ఐఫోన్ వినియోగిస్తున్న నేతలకు అలర్ట్ పంపిన ఆపిల్
  • మీ ఫోన్లు సురక్షితమైనవేనా అంటూ ఆపిల్ ను అడిగిన కేంద్రం
  • సురక్షితమైనవే అయితే ఎందుకు అలర్ట్ పంపారని ప్రశ్న
భారత్ లో విపక్ష నేతల ఫోన్లను ప్రభుత్వ మద్దతు గల హ్యాకర్లు హ్యాక్ చేశారని గతేడాది ఆపిల్ సంస్థ సంచలనం రేపింది. ఐఫోన్లు వాడుతున్న విపక్ష నేతలకు ఈ మేరకు ఆపిల్ అలర్ట్ మెసేజ్ పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం ఆపిల్  సంస్థను కోరింది. అయితే, ఇంతవరకు ఆపిల్ నుంచి స్పందన లేదు. 

ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. "కేంద్రం ఆపిల్ సంస్థను రెండు చిన్న ప్రశ్నలు అడిగింది. ఆపిల్ సంస్థ తయారు చేస్తున్న ఐఫోన్లు సురక్షితమైనవేనా? ఒకవేళ సురక్షితమైనవే అయితే విపక్ష నేతలకు అలర్ట్ మెసేజ్ ఎందుకు పంపారు?... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతున్నాం" అని పేర్కొన్నారు. 

తనకు తెలిసినంత వరకు ఏ సంస్థ కూడా తమ ఉత్పత్తుల్లో లోపాలు ఉన్నాయంటే ఏమాత్రం ఒప్పుకోదు అని తెలిపారు. అంతేకాదు, ఏ సంస్థలోనైనా లోపాలను కప్పిపుచ్చుకునే అలవాటు ఉంటుంది అని వ్యాఖ్యానించారు. 

'మీ ఫోన్ (ఐఫోన్) అంత లోపభూయిష్టమైనదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం... కానీ ఈ ప్రశ్నకు ఇంతవరకు స్పష్టమైన సమాధానం రావడంలేదు' అని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.


More Telugu News