సైకిల్ సామాన్యుడి రథం... గ్లాసు ప్రతి ఒక్కరూ వాడాల్సిందే!: గాజువాక శంఖారావం సభలో లోకేశ్

  • విశాఖ పరిధిలో లోకేశ్ శంఖారావం యాత్ర
  • గాజువాకలో సభ
  • సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన లోకేశ్
  • జగన్ ఫ్యాన్ ఉరేసుకోవడానికి పనికొస్తుందని విమర్శలు 
  • జగన్ ను ప్రజలు ఫుట్ బాల్ ఆడే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విశాఖలో వరుసగా శంఖారావం సభలు  నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్నంగా గాజువాకలో నిర్వహించిన శంఖారావం సభలో ప్రసంగించారు.

ఫ్యాను ఇంట్లో ఉండాలి... సైకిల్ ఇంటి బయట ఉండాలి... టీ తాగేసిన గ్లాసు సింక్ లో ఉండాలి అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ స్పందించారు. 

సైకిల్ అనేది సామాన్యుడి చైతన్య రథం అని స్పష్టం చేశారు. ఇక, గ్లాసును ప్రతి ఒక్కరూ వాడాల్సిందేనని అన్నారు. ప్రతి సామాన్యుడు గ్లాసును వాడకుండా ఉండలేరని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగుల జగన్ ఫ్యాన్ కు ఉరేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ ఫ్యాన్ ఆత్మహత్యలు చేసుకోవడానికి పనికొస్తుందని విమర్శించారు.

పెంచుకుంటూ పోవడమే జగన్ పని

అన్ని చార్జీలు పెంచుకుంటూ పోవడమే జగన్ పని అని నారా లోకేశ్ విమర్శించారు. ఏపీలో  బాదుడే బాదుడు... తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు, మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు... ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన ఘనత జగన్ ది... రేపో మాపో చెత్తపై కూడా పన్ను వేస్తారేమో అని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ వచ్చి వాలంటీర్లు అబద్ధాలు చెబుతున్నారని లోకేశ్ మండిపడ్డారు.

కోడిగుడ్డు మంత్రి వలన ఒక్క పరిశ్రమ కూడా రాలేదు

100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కడేనని లోకేశ్ అన్నారు. భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు కనీసం ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. కోడిగుడ్డు మంత్రి వలన ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమది అని పునరుద్ఘాటించారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారని, విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా చూసే బాధ్యత తమది అని లోకేశ్ సభాముఖంగా ప్రకటించారు. గంగవరం పోర్టు బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఏపీఐఐసీ బాధితుల సమస్యను రెండేళ్లలో పరిష్కరిస్తామని తెలిపారు. 

జగన్ ను ప్రజలే ఫుట్ బాల్ ఆడే పరిస్థితి వస్తుంది

ఉత్తరాంధ్ర ప్రజలతో జగన్ ఎలా ఆడుకున్నాడో, ఇప్పుడదే ప్రజలు జగన్ ను ఫుట్ బాల్ ఆడే పరిస్థితి వస్తుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. నవరత్నాలు అని చెప్పి నవ మోసాలు చేస్తున్నారని విమర్శించారు. నవ మోసాలపై నాతో చర్చించడానికి జగన్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. విశాఖలో రుషికొండకు గుండు కొట్టారని, ఒక్క వ్యక్తి నివసించే భవనం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు.


More Telugu News