ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ దాడి.. వీడియో షేర్ చేసిన పరిటాల శ్రీరామ్

  • రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడి
  • దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ
  • వైసీపీ రౌడీ రాజకీయాలకు ఇది మరో నిదర్శనమన్న శ్రీరామ్
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ 'సిద్ధం' సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై పిడిగుద్దులు గుద్దుతూ, కర్రలతో చితకబాదారు. మీరు ఆంధ్రజ్యోతా అని ఆరాతీస్తూ దాడి చేశారు. దాదాపు అర కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దెబ్బలతో సొమ్మసిల్లిన శ్రీకృష్ణను ఓ సీఐ ఎత్తుకుని తన వాహనంలోకి ఎక్కించారు. అతన్ని తమకు అప్పగించాలంటూ వైసీపీ శ్రేణులు వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. సీఐపై కూడా దాడికి యత్నించారు. శ్రీకృష్ణ వద్ద ఉన్న కెమెరా, సెల్ ఫోన్, పర్సు అన్నీ లాక్కున్నారు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

శ్రీకృష్ణపై జరగిన దాడి వీడియోను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వైసీపీ రౌడీ రాజకీయాలకు ఇది మరో నిదర్శనం అని ఆయన మండిపడ్డారు. సిద్ధం సభకు వస్తున్నది కార్యకర్తలా లేక గూండాలా అనే అనుమానం వస్తోందని అన్నారు. ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పారు. అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.


More Telugu News