సుప్రసిద్ధ జైన సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూత... ప్రధాని మోదీ స్పందన

  • జైన మత సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ అస్తమయం
  • సల్లేఖన ప్రక్రియ ద్వారా ప్రాణత్యాగం
  • గత మూడ్రోజులుగా పచ్చి మంచినీరు కూడా ముట్టని జైన సన్యాసి
సుప్రసిద్ధ జైన సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ తుదిశ్వాస విడిచారు. చత్తీస్ గఢ్ రాజనందన్ గావ్ జిల్లాలోని చంద్రగిరి తీర్థంలో ఆయన సల్లేఖన ప్రక్రియ ద్వారా కన్నుమూశారు. 

దేహం నుంచి ప్రాణత్యాగం చేయడానికి జైన సన్యాసులు సల్లేఖన అనే క్రతువును అవలంబిస్తారు. ఇది ఆధ్యాత్మిక సంప్రోక్షణ వంటిది. సల్లేఖన ప్రారంభించాక, ప్రాణాలు పోయేంతవరకు ఎలాంటి ఆహారం స్వీకరించకుండా ఉంటారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కూడా సల్లేఖన స్వీకరించి ఆత్మ త్యాగం చేశారు. 

ఆయన గత అర్ధరాత్రి దాటాక 2.35 గంటల సమయంలో దేహాన్ని చాలించారని, సమాధి స్థితిలోకి వెళ్లారని చంద్రగిరి తీర్థం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

"ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ దోంగర్ గఢ్ లోని చంద్రగిరి తీర్థంలో గత ఆర్నెల్లుగా ఉంటున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన అస్వస్థతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడ్రోజులుగా సల్లేఖన అవలంబిస్తూ ఎలాంటి ఆహారం స్వీకరించలేదు. కనీసం మంచి నీరు కూడా తాగలేదు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఆచార్య విద్యాసాగర్ మరణం తీరని నష్టం: ప్రధాని మోదీ

ప్రముఖ జైనమత సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూశారన్న వార్త విని ప్రధాని  నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని నష్టం అని పేర్కొన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ఆయన కృషి చిరస్మరణీయం అని వివరించారు. 

"ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ తన జీవితాంతం సమాజంలో దారిద్ర్య నిర్మూలన కోసం, ఆరోగ్య పరిరక్షణ, విద్యా వ్యాప్తి కోసం పాటుపడ్డారు. ఆయన ఆశీస్సులు సదా నాపై ఉండేవి... అందుకు నేను చాలా అదృష్టవంతుడ్ని. గతేడాది చత్తీస్ గఢ్ లోని చంద్రగిరి జైన దేవాలయంలో ఆయనతో నా సమావేశం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో ఆయన నుంచి ఎంతో ప్రేమను, దీవెనలను పొందగలిగాను. సమాజ హితం కోసం ఆయన అసమాన భాగస్వామ్యం ప్రతి తరం వారికి స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటుంది" అంటూ మోదీ వివరించారు. అంతేకాదు, ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ ను కలిసినప్పటి ఫొటోలను కూడా పంచుకున్నారు.



More Telugu News