జైలుకు వెళ్లిన వాళ్లు గెలిచారు... ఈసారి చంద్రబాబు కూడా గెలుస్తాడు: ఉండవల్లి అరుణ్ కుమార్

  • ఏపీ పరిస్థితులపై స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్
  • చంద్రబాబు, సీఎం జగన్ పై వ్యాఖ్యలు
  • ప్రత్యేకహోదాపై ఆడగడానికి భయపడుతున్నారని వెల్లడి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డాడని, ఇప్పుడు జగన్ కూడా భయపడ్డాడని వెల్లడించారు. కేసుల భయంతోనే వాళ్లు వెనుకంజ వేశారని తెలిపారు. రాక్షసుడ్ని, దుర్మార్గుడ్ని అయినా భరించవచ్చు కానీ, పిరికివాడ్ని భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు. 

"ఎన్నికల సమయంలో నోటాకు ఓట్లు పడకపోవడానికి కారణాలు ఉన్నాయి. ప్రజలు ఎవరు తక్కువ అవినీతిపరుడో చూసుకుని వారికి ఓటేస్తున్నారు తప్ప, నోటా జోలికి వెళ్లడంలేదు. మార్కెట్లో టమాటాలన్నీ పుచ్చులే ఉన్నప్పుడు వాటిలో కాస్త తక్కువ పుచ్చులున్న వాటినే ఏరుకుంటాం... ఇదీ అంతే. ఎన్నికలు మానేయమంటే ప్రజలు మానేస్తారా? టమాటాల విషయంలోనే కాదు, ఇది అన్నింటికీ వర్తిస్తుంది. 

కానీ, ఇతను కేంద్రాన్ని అడగడానికి భయమండీ అంటుంటే ఇంకేమనాలి? చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఐదేళ్లూ అడగడానికి భయపడ్డాడని అన్నారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అడగడానికి భయపడుతున్నాడని అంటున్నారు. కేసులు లేకుండా ఎవరున్నారు? 

ప్రపంచంలోకెల్లా నేనే నిజాయతీపరుడ్ని అని చెప్పే కేజ్రీవాల్ మీద కూడా కేసు పెట్టేశారు. ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్లలో ఎవరు చేరకుండా, అందరూ ప్రభుత్వ స్కూళ్లలోనే చేరే పరిస్థితి తెచ్చిన సిసోడియాను కూడా జైల్లో వేసేశారు. సిసోడియా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మార్చేశాడు, ప్రభుత్వ స్కూళ్ల వాతావరణాన్నే మార్చేశాడు, ఫ్యాకల్టీలనే మార్చేశాడు... అలాంటి వాడిపైనా కేసులు పెట్టారు. సిసోడియా జైలుకెళ్లి సంవత్సరం అవుతోంది... అతడ్ని బయటికి రానివ్వరు. ఇలా అందర్నీ ఏరతారు... దీని వల్ల నష్టమేంటి? 

జైలుకెళితే ఓడిపోతాననడం అర్థరహితం. జైలుకు వెళ్లిన ప్రతివాడు గెలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడు... రాగానే గెలిచాడు. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాడు... గెలిచాడు. ఇవాళ చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు... అందరూ అదే అంటున్నారు... చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు, గెలుస్తాడు అంటున్నారు. 

ఏదైనా వివాదాస్పద అంశంలో వాళ్లది రైటా, మనది రైటా అని తిరగబడానికి కొంచెం ఆలోచించడంలో తప్పులేదు. మిగతావారంతా సపోర్ట్ చేస్తారో, చేయరో అని ఆలోచించడం సమంజసమే. కానీ చట్టాన్ని అమలు చేసే విషయంలో కూడా తిరగబడకపోతే ఎలా? పార్లమెంటు తలుపులు మూసి, ఎంతో రగడ చేసి రాష్ట్ర విభజన చట్టం తయారుచేశారు. ఆ చట్టాన్నే అమలు చేయడానికి తిరగబడమంటున్నాం" అని ఉండవల్లి స్పష్టం చేశారు. 


More Telugu News