జగన్ కట్టుకొన్న ఆ ప్యాలెస్‌ను ప్రజలకు అంకితం చేస్తాం: లోకేశ్

  • భీమిలి సభ ముగించుకుని వస్తూ రుషికొండ వద్ద లోకేశ్ సెల్ఫీలు
  • జగన్ అనే అవినీతి అనకొండ రుషికొండను మింగేసిందన్న టీడీపీ యువనేత
  • మరో రెండు నెలల్లో జగన్‌ను ప్రజలు ఫుట్‌బాల్ ఆడుకుంటారన్న లోకేశ్
  • 70 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా
రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన గెలిచి అధికారంలోకి వస్తే రుషికొండపై వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్‌ను ప్రజలకు అంకితం చేస్తామని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. శంఖారావం కార్యక్రమంలో భాగంగా లోకేశ్ నిన్న విజయనగరం జిల్లా ఎస్‌కోట, విశాఖపట్టణం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. భీమిలి సభ ముగించుకుని తిరిగి వస్తూ రుషికొండ వద్ద ఆగి, అక్కడి నిర్మాణాలను చూపిస్తూ సెల్ఫీ దిగారు. 

అనంతరం మాట్లాడుతూ జగన్ అనే అవినీతి అనకొండ రుషికొండను మింగేసిందని, 9 నగరాల్లో 9 ప్యాలెస్‌లు ఉన్న పెత్తందారు జగన్ అని ఆరోపించారు. ఒక్కడి కోసం వందలకోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని, రుషికొండను బోడిగుండు చేసి విధ్వంసం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో భూములు కొట్టేసి ఇక్కడి ప్రజలతో జగన్ ఆడుకున్నారని, మరో రెండు నెలల్లో ప్రజలే జగన్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటారని హెచ్చరించారు.

స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వమే కొంటుంది
వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తే ఆ భూములు కొట్టేయాలని జగన్ ఆలోచిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి కలిసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని, అవంతి శ్రీనివాస్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారని మండిపడ్డారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ కొండలపై, ఖాళీ భూములపై వాలిపోతూ రాత్రికి రాత్రే కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఆ భవనాలు ఇవే
విజయనగరం జిల్లా సోంపురం సభలో లోకేశ్ మాట్లాడుతూ జగన్, ఎస్‌కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఇద్దరూ ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కడుబండి రూ. 50 కోట్లతో నిర్మించిన భవనాలు ఇవేనంటూ లోకేశ్ ఆ ఫొటోలను ప్రదర్శించారు. జగన్ తమ అభ్యర్థుల స్థానాలను మార్చుతుంటే వారంతా వైసీపీలో ఉండలేక పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అంబటి రాయుడికి టికెట్ ఇచ్చేందుకు వందలకోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో ఆయన బయటకు వచ్చేశారని ఆరోపించారు. 70 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి అభ్యర్థులే లేరని లోకేశ్ ఎద్దేవా చేశారు.


More Telugu News