ఫుల్లుగా మద్యం తాగి పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. ఏమని బెదిరించాడంటే?

  • మద్యం మత్తులో కాల్ చేసినట్టుగా గుర్తించిన పోలీసులు
  • జనవరి 28న కాల్.. మొబైల్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఎట్టకేలకు ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసులు
  • కాల్ చేసినట్టుగా విచారణలో అంగీకరించాడన్న పోలీసులు
ఫుల్లుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఆ మత్తులో పోలీసులకు ఫోన్ చేసి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (IGI Airport) బాంబుతో పేల్చివేస్తానని బెదిరించాడు. జనవరి 28న బెదిరింపు కాల్ రాగా నిందితుడిని శనివారం(ఫిబ్రవరి 17) అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. నిందితుడి పేరు కృష్ణో మహతో అని, అతడి వయసు 38 సంవత్సరాలని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పోలీసులు వెల్లడించారు. కృష్ణో మహతో బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందినవాడని, ఢిల్లీలోని కపషేరాలో అతడిని అరెస్టు చేశామని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఐజీఐ ఎయిర్‌పోర్ట్) ఉషా రంగనాని తెలిపారు. బాంబు బెదిరింపు కాల్ చేసినట్లుగా నిందితుడు అంగీకరించాడని వెల్లడించారు.

ఫుల్లుగా మద్యం మత్తులో ఉండి ఈ కాల్ చేశాడని, జనవరి 28న తన మొబైల్ నుంచి ఫోన్ చేశాడని ఉషా రంగనాని వివరించారు. కాల్ చేసిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో చాలా రోజులపాటు అతడిని ట్రేస్ చేశామని, కాల్ వచ్చిన నంబర్ అడ్రస్ బీహార్‌లో ఉండడంతో అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకున్నామని, ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశామని వివరించారు.


More Telugu News