క్యాన్సర్ కారక రసాయనాలు... పీచు మిఠాయి విక్రయాలను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం

  • పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు చెన్నైలో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ విభాగం
  • అధ్యయనంలో రోడమైన్-బి అనే రసాయనాన్ని గుర్తించిన అధికారులు
  • కృత్రిమ రంగు కోసం పీచు మిఠాయిలో దీనిని వినియోగిస్తున్నట్లు గుర్తింపు
పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో వాటి విక్రయాలను రాష్ట్రంలో నిషేధించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం వెల్లడించారు. పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఇటీవల ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు చెన్నైలో తనిఖీలు నిర్వహించారు. ఈ నమూనాల అధ్యయనంలో రోడమైన్-బి అనే రసాయనాన్ని గుర్తించారు. కృత్రిమ రంగు కోసం పీచు మిఠాయిలో దీనిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

రోడమైన్-బీని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. బట్టల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లలో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. ఫుడ్ కలర్ కోసం దీనిని ఉపయోగించే అవకాశం లేదు. ఎందుకంటే దీని వల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఈ రసాయనం శరీరంలోకి వెళితే కిడ్నీ, లివర్ పైన ప్రభావం చూపుతుందని, అల్సర్‌తో పాటు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో పీచు మిఠాయిలలో దీనిని ఉపయోగిస్తున్నందున వీటి అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.


More Telugu News