సినీ కవి గుల్జార్, జగద్గురు రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్ పురస్కారం

  • నేడు జ్ఞానపీఠ్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • ఉర్దూ కవిగా, సినీ గీత రచయితగా వినుతికెక్కిన గుల్జార్
  • 100కి పైగా పుస్తకాలు రచించిన సంస్కృత పండితుడిగా రామభద్రాచార్యకు గుర్తింపు
కేంద్ర ప్రభుత్వం నేడు జ్ఞానపీఠ్ అవార్డులు ప్రకటించింది. ప్రముఖ ఉర్దూ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత గుల్జార్ ను జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక చేసింది. సంస్కృత పాండిత్య దిగ్గజం జగద్గురు రామభద్రాచార్యకు కూడా జ్ఞానపీఠ్ ప్రకటించింది. 

హిందీ చిత్రసీమలో తన అనేక సూపర్ హిట్ గీతాలకు చక్కని సాహిత్యం అందించిన గుల్జార్ కు పురస్కారాలు కొత్త కాదు. ఆయనను 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ వరించింది. దేశంలోని ప్రముఖ ఉర్దూ  కవుల్లో ఒకరిగా గుల్జార్ ను పరిగణిస్తారు. 

గుల్జార్ అనేది కలం పేరు. ఆయన అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. ఆయన కలం నుంచి అనేక ఉర్దూ కవితలు, షాయరీలు జాలువారాయి. ఆయన ఉర్దూ, పంజాబీ భాషల్లో పలు కథలు కూడా రాశారు. 2004లో ఆయనకు పద్మ విభూషణ్ ప్రదానం చేశారు. 

ఇక, జగద్గురు రామభద్రాచార్య 100కి పైగా పుస్తకాలు రచించారు. బాల్యంలోనే అంధత్వానికి గురైన రామభద్రాచార్య, దివ్యాంగుల కోసం మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో యూనివర్సిటీ ప్రారంభించారు.


More Telugu News