తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది... నాకు ఆ నమ్మకం ఉంది: జాతీయ సమావేశాల్లో జేపీ నడ్డా

  • అనేక ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నామన్న జేపీ నడ్డా
  • వివిధ రాష్ట్రాల్లో వరుసగా గెలుస్తున్నామని గుర్తు చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు
  • ఒక్కోసారి ఓటమిలోనూ విజయం ఉంటుందని వ్యాఖ్య
  • బెంగాల్‌లో 77 సీట్లు గెలుచుకున్నామన్న జేపీ నడ్డా
  • తెలంగాణలో ఓటింగ్ శాతం 7.1 శాతం నుంచి 14 పెరిగి 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నామన్న జేపీ నడ్డా
భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని... తనకు ఆ నమ్మకం ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందన్నారు. అనేక ఎన్నికల్లో మనం వరుసగా గెలుస్తూ వస్తున్నామని తెలిపారు. గుజరాత్‌లో వరుసగా ఇరవై ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నామని, త్రిపురలోనూ మన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అసోంలో, మణిపూర్ రాష్ట్రాలలో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇటీవలే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చామన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. సంకల్పించిన అన్ని పనులను మోదీ పూర్తి చేశారని తెలిపారు. ఒక్కోసారి ఓటమిలోనూ విజయం ఉంటుందని... ఇందుకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ ఉదాహరణ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకున్నామన్నారు. తెలంగాణలో ఓటింగ్ శాతం 7.1 నుంచి 14 శాతానికి చేరుకుందని తెలిపారు. తెలంగాణలో మనకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ అని తెలిపారు. జల్ మిషన్‌లో భాగంగా 11 కోట్ల మందికి సురక్షిత మంచినీటిని అందిస్తున్నట్లు తెలిపారు.

మన దేశ రాజకీయ స్థితిగతులను ప్రధాని మోదీ మార్చివేశారన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీ గరీబ్, యువ, రైతు, మహిళా శక్తిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతోందన్నారు. దేశాన్ని ముందంజలో ఉంచడంలో వీరి పాత్ర ఉంటుందన్నారు. దేశంలో ముప్పై ఏళ్ల తర్వాత బీజేపీ మాత్రమే సంపూర్ణ మెజార్టీతో 2014లో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. తొలుత భారతీయ జన సంఘ్, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు బీజేపీ గడిచిన ఏడు దశాబ్దాలలో ఎన్నో ఉత్థానపతనాలను చూసిందన్నారు. ఎమర్జెన్సీని కూడా చూశామని... కానీ గత దశాబ్ద కాలంలో మోదీ నాయకత్వంలో ఎన్నో విజయాలను సాధించడం మరింత సంతోషకరమన్నారు.


More Telugu News