కేసీఆర్‌కి బర్త్‌డే విశెష్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మనవడు హిమాన్షు

  • తాతయ్యకు ప్రేమతో 70వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్
  • ఇద్దరు తండ్రులు పెంచారని చెప్పుకోవడానికి గర్విస్తానంటూ భావోద్వేగం
  • తాత మాటలు వింటే ఒత్తిడి, సమస్యలు మాయమవుతాయన్న కేటీఆర్ కుమారుడు
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేడు (శనివారం) 70వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో ఆయన మనవడు, కేటీఆర్ కొడుకు హిమాన్షు కూడా చేరిపోయాడు. తాతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

‘‘ తాతయ్యకు ప్రేమతో 70వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని అందించినందుకు, ప్రస్తుతం నేనున్న స్థితికి ఎదిగేలా పెంచినందుకు నీకు ధన్యవాదాలు. నన్ను ఒక్కరు కాదు.. ఇద్దరు తండ్రులు పెంచారని చెప్పుకోవడానికి ఎల్లప్పుడూ గర్వపడతాను. విశ్వాసం, ఆప్యాయతతో కూడిన మీ మాటలు వింటే నా ఒత్తిడి, సమస్యలన్నీ దూరమవుతాయి. కష్టకాలంలో ఆత్మవిశ్వాసం, సహనంతో ఉండాలంటూ మీరు చెప్పిన సూచనలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. అసమానమైన తాతగా, నిజమైన నా దోస్తుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా కోసం మీరు చేసిన ప్రతిదానికి కృతజ్ఞతలు. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను. జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ హిమాన్షు భావోద్వేగానికి గురయ్యాడు.

ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఈ పోస్టుకు కేసీఆర్‌తో దిగిన పాత ఫొటోని హిమాన్షు షేర్ చేశాడు. ఈ ఫొటోలో హిమాన్షు చేతిపై కేసీఆర్ అప్యాయంగా ముద్దుపెడుతూ కనిపించారు.


More Telugu News