రాజ్‌కోట్ టెస్ట్.. చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి టీమిండియా ఆటగాళ్లు!

  • ఇటీవల బరోడాలో మరణించిన టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావ్ గైక్వాడ్
  • 95 ఏళ్ల వయసులో కన్నుమూత
  • ఆయనకు నివాళిగానే నల్లరిబ్బన్లు ధరించి మైదానంలోకి వచ్చిన టీమిండియా క్రికెటర్లు
రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు భారత ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్లన్లు ధరించి మైదానంలోకి దిగారు. అదిచూసిన ప్రేక్షకులు చేతికి ఆ నల్ల రిబ్బన్లు ఎందుకని ప్రశ్నించుకోవడం కనిపించింది. దీనివెనక ఓ కారణం ఉంది. టీమిండియా టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావ్ గైక్వాడ్ ఈ నెల 13న బరోడాలో కన్నుమూశారు. ఆయనకు సంతాపంగా టీమిండియా ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించారు.

టీమిండియా మాజీ కెప్టెన్ అయిన గైక్వాడ్ 95 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఆయన మృతికి నివాళిగానే ఆటగాళ్లు ఇలా నల్ల రిబ్బన్లు ధరించినట్టు బీసీసీఐ తెలిపింది. దత్తాజీరావ్ గైక్వాడ్ 1952లో భారత తరపున అరంగేట్రం చేశారు. 1961 వరకు 11 టెస్టుల్లో భారత్‌కు ప్రాతనిధ్యం వహించారు. అలాగే, 110 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.

ప్రస్తుతం రాజ్‌కోట్‌లో జరుగుతున్న టెస్టులో మూడోరోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి భారత్ కంటే 155 పరుగులు వెనకబడి ఉంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 39, బెన్ ఫోక్స్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.


More Telugu News