బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి వల్లే మేడిగడ్డ దెబ్బతింది.. అన్నారం బ్యారేజీలో కూడా నిన్నటి నుంచి లీకేజీ మొదలైంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన ఉత్తమ్
  • మూడేళ్లలోనే మేడిగడ్డ కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన
  • మల్లన్న సాగర్ కు కూడా ప్రమాదం పొంచి ఉందని కాగ్ చెప్పిందని వెల్లడి
తెలంగాణ నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ అత్యంత ప్రధానమైనదని... ఈ బ్యారేజీ కుంగిపోవడం దురదృష్టకరమని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిజైన్, నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపం వల్ల బ్యారేజీ కుంగిపోయిందని చెప్పారు. మూడేళ్లలోనే ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన అంశంలో నిమిషం నిడివి గల వీడియోను అసెంబ్లీలో ఉత్తమ్ విడుదల చేశారు. 

మేడిగడ్డకు ఈ పరిస్థితి రావడానికి గత ప్రభుత్వ నిర్వాకం, అవినీతే కారణమని ఉత్తమ్ చెప్పారు. రూ. 1,800 కోట్లతో టెండర్లను పిలిచి... అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోతూ రూ. 4,500 కోట్లకు తీసుకెళ్లారని అన్నారు. ఈ విషయాన్ని గమనిస్తే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతుందని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 21నే మేడిగడ్డ కుంగిపోయిందని... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఆ అంశంపై కేసీఆర్ మాట్లాడలేదని దుయ్యబట్టారు. డిజైన్, పర్యవేక్షణ లోపం కారణంగానే మేడిగడ్డ ప్రమాదానికి గురైందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తన నివేదికలో తెలిపిందని అన్నారు. 

అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచి లీకేజీ మొదలయిందని ఉత్తమ్ తెలిపారు. ఈ బ్యారేజ్ కూడా కుంగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నారం బ్యారేజీని పరిశీలించేందుకు ఎన్డీఎస్ఏ అధికారులను పిలిపించామని... ఈ బ్యారేజ్ కు కూడా ప్రమాదం పొంచి ఉందని అధికారులు తెలిపారని చెప్పారు. బ్యారేజ్ లో నీటిని కొంతమేర ఖాళీ చేయాలని సూచించారని తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా నిరుపయోగమని ఉత్తమ్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 81 వేల కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని... అయితే, రూ. 1.47 కోట్లకు వ్యయం పెరిగిందని చెప్పారు. ఇప్పటి లెక్కల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ. 2 లక్షల కోట్లు కావాలని అన్నారు. ఎలాంటి సర్వే చేయకుండానే మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించారని... చిన్నపాటి భూప్రకంపన వచ్చినా ఈ ప్రాజెక్టుకు ప్రమాదమేనని కాగ్ హెచ్చరించిందని తెలిపారు. మల్లన్న సాగర్ పరిధిలోని ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని కాగ్ హెచ్చరించిందని చెప్పారు.


More Telugu News