పవార్ కుటుంబంలో చిచ్చు.. సుప్రియా సూలేపై అభ్యర్థిని నిలబెడతానన్న అజిత్ పవార్

  • లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాలు
  • ఐదు దశాబ్దాలుగా శరద్ పవార్‌ కుటుంబానికి కంచుకోటలా బారామతి నియోజకవర్గం
  • అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికైన సుప్రియా సూలె
  • వచ్చే ఎన్నికల్లో ఆమెపై పోటీకీ తన భార్య సునేత్రను దింపుతున్న అజిత్ పవార్ 
  • అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి బరిలోకి అజిత్ పవార్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ అంటూ స్పీకర్ ప్రకటించిన తర్వాతి నుంచి రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా ఇప్పుడు అజిత్ చేసిన ప్రకటన పవార్ కుటుంబంలోని కలహాలను బయటపెట్టింది. సీనియర్ నేత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై అజిత్ పవార్ తన భార్య సునేత్రా పవార్‌ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బారామతి లోక్‌సభ స్థానంలో ఐదు దశాబ్దాలుగా పవర్ కుటుంబం జెండా ఎగురవేస్తోంది. 2009 నుంచి సుప్రియ వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 

1967, 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ బారామతి నుంచే గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి 1984, 1996,1998, 1999, 2004లలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే, ఈసారి మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎన్సీపీ రెండు ముక్కలు కావడం, ఎన్సీపీ సభ్యులు కొందరు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో రాజకీయ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 


ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి సుప్రియా సూలేపై తమ అభ్యర్థే గెలుస్తారని, తాను అదే స్థానం నుంచి ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని అజిత్ పవార్ చెప్పారు. అంతేకాదు, గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీచేయని వ్యక్తి ఈసారి బరిలోకి దిగుతున్నారని చెప్పడం ద్వారా అది మరెవరో కాదని, అది ఆయన భార్య సునేత్రేనని చెప్పకనే చెప్పినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.


More Telugu News