ఆస్ట్రేలియాలో వరదల్లో చిక్కుకుని భారత యువతి దుర్మరణం

  • క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో ఘటన
  • మాల్బన్ నదిపై ఉన్న క్లాన్‌కర్రీ డౌచెస్ రోడ్డుపై వరద
  • వరద నీటిలో ప్రయాణించే క్రమంలో కొట్టుకుపోయిన కారు
  • కారులోని యువతి మృతి, ఘటనపై భారత హైకమిషన్ విచారం
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో వరదలు ఓ భారతీయ యువతిని బలితీసుకున్నాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన కారులో 28 ఏళ్ల యువతి మృతదేహాన్ని స్థానిక అధికారులు గుర్తించారు. ఈ మేరకు మౌంట్ ఇసా పోలీస్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ టామ్ ఆర్మిట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, మృతురాలి వివరాలు మాత్రం వెల్లడించలేదు. వరదనీటిలో పాక్షికంగా మునిగి ఉన్న కారులో యువతి మృత దేహం కనిపించిందన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

మౌంట్ ఇసాను ఫాస్ఫేట్ హిల్ మైన్ కౌంటీతో కలుపుతూ మాల్బన్ నదిపై ఉన్న క్లాన్‌కర్రీ డౌచెస్ రోడ్డుపై యువతి వరదనీటిలోనే కారు నడిపేందుకు ప్రయత్నించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. రోడ్డుపై నీరు అడుగులోతు మేరకే ఉన్నా ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో యువతి కారు కొట్టుకుపోయిందని చెప్పారు. నీటిలో ఇరుక్కుపోయిన కారును బయటకు లాగేందుకు క్వీన్స్ లాండ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. 

కాగా, యువతి తమ ఉద్యోగేనని ఫాస్ఫేట్ మైనింగ్‌లోని ఓ సంస్థ పేర్కొంది. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ విషయంలో పోలీసులకు సహాయసహకారాలు అందిస్తామని వెల్లడించింది. మరోవైపు ఘటనపై స్పందించిన కాన్బెరాలోని భారత హైకమిషన్ విచారం వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి ఏ సాయం చేసేందుకైనా సిద్ధమని వెల్లడించింది. 

ఇటీవల క్వీన్స్‌లాండ్ రాష్ట్రాన్ని కిర్రీలీ సైక్లోన్ అతలాకుతలం చేసింది. తుపాను తీరం దాటిన తరువాత కూడా చాలా రోజుల పాటు వర్షాలు కొనసాగడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. వరద నీటిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలోనే తాజా ప్రమాదం జరిగింది.


More Telugu News