84 శాతం మంది భారత స్మార్ట్‌ఫోన్ యూజర్లు నిద్రలేవగానే చేసేదిదే!
- భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అలవాట్లపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక
- గత దశాబ్ద కాలంలో స్మార్ట్‌ఫోన్లతో ప్రజల్లో గణనీయ మార్పులు
- 84 శాతం మంది యూజర్లు ఉదయం నిద్రలేచిన 15 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ చెక్ చేస్తున్నట్టు వెల్లడి
- వీడియోలు చూసేందుకే స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న వైనం
మన జీవితాలతో స్మార్ట్‌ఫోన్ ఎంతగా పెనవేసుకుపోయిందో కళ్లకుకట్టినట్టు చెప్పే సర్వే ఒకటి తాజాగా విడుదలైంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ యూజర్ల అలవాట్లపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ‘రీఇమాజినింగ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్‌పీరియన్స్: హౌ సర్ఫేసెస్ ప్లే కీ రోల్ ఇన్ మేకింగ్ ఫోన్స్ స్మార్టర్’ పేరిట ఈ నివేదిక విడుదలైంది. 2010లో స్మార్ట్‌ఫోన్ల యుగం ప్రారంభమైన తొలి రోజులను, ప్రస్తుత పరిస్థితులను పోలుస్తూ ఈ నివేదిక రూపొందించారు.
సర్వేలో ముఖ్యాంశాలు
సర్వేలో ముఖ్యాంశాలు
- స్మార్ట్‌ఫోన్ యూజర్లలో 84 శాతం మంది నిద్రలేచిన తొలి 15 నిమిషాల్లో తమ ఫోన్ చెక్ చేసుకుంటున్నారు.
- మెలకువగా ఉన్నప్పుడు దాదాపు 31 శాతం సమయం ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారు.
- రోజుకు సగటున 80 సార్లు నోటిఫికేషన్లు, ఇతర మెసేజీల కోసం ఫోన్లు చెక్ చేస్తుంటారు.
- దాదాపు 50 శాతం మంది స్మార్ట్‌ఫోన్లలో వీడియో కంటెంట్ చూస్తుంటారు.
- 2010లో ఫోన్లపై సగటున 2 గంటలు వెచ్చిస్తుండగా ఇప్పుడా సమయం 4.9 గంటలకు పెరిగింది.
- 2010లో జనాలు ఫోన్లతో మెసేజీలు, కాల్స్ చేసేందుకే పరిమితమైతే ప్రస్తుత రోజుల్లో పావు శాతం సమయమే వీటికి కేటాయిస్తున్నారు.
- స్మార్ట్‌ఫోన్లను ఇతరులతో టచ్‌లో ఉండే బదులు సెర్చింగ్, గేమింగ్, షాపింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
- 18-24 ఏళ్ల మధ్య వయసున్న వారిలో అధికశాతం షార్ట్ వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు. 35 ఏళ్లకు పైబడ్డ వారిలో ఈ ట్రెండ్ తక్కువగా ఉంది.
- సుమారు 66 శాతం సందర్భాల్లో జనాలు అవసరం కంటే అలవాటుగా సెల్‌ఫోన్‌ను చేతుల్లోకి తీసుకుంటున్నారు.
- జనాభాలో అధిక శాతం మంది తొలిసారిగా ఇంటర్నెట్ సేవలను స్మార్ట్‌ఫోన్ ద్వారానే పొందారు. తక్కువ ధరకు డాటా, డెస్క్ టాప్‌లు ఖరీదైన వ్యవహారంగా మారడంతో సెల్‌ఫోన్‌పై ఆధారపడుతున్నారు.