మిలియన్ మందిలో ఒక్కడు... అశ్విన్ ఘనతపై సచిన్ స్పందన

  • టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్న అశ్విన్
  • ఇంగ్లండ్ తో మూడో టెస్టు సందర్భంగా అశ్విన్ ఘనత
  • టెస్టుల్లో అతి పెద్ద ఘనత సాధించావంటూ సచిన్ అభినందన
సుదీర్ఘకాలంగా టీమిండియాకు సేవలు అందిస్తున్న సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్ తో మూడో టెస్టులో అరుదైన మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ రికార్డులకెక్కాడు. 

అంతేకాదు, టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 9వ బౌలర్ అశ్విన్. స్పిన్నర్లలో అశ్విన్ కంటే ముందు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, నాథన్ లైయన్ మాత్రమే 500 వికెట్ల మార్కును అందుకున్నారు. 

తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్ 2011లో టెస్టు క్రికెట్ గడప తొక్కాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు టెస్టుల్లో సొంతగడ్డపై టీమిండియాకు మ్యాచ్ విన్నర్ గా కొనసాగుతున్నాడు. అశ్విన్ 500 వికెట్లలో 347 వికెట్లు భారత్ లో సాధించినవే. 

కాగా, అశ్విన్ 500 వికెట్ల ఘనతపై భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. 10 లక్షల మందిలో అశ్విన్ వంటి బౌలర్ ఒక్కరు మాత్రమే ఉంటారని కితాబునిచ్చారు. అలాంటి మేలిమి ఆఫ్ స్పిన్నర్ ఖాతాలో 500 వికెట్ల ఘనత చేరిందని కొనియాడారు. 

అశ్విన్ వంటి స్పిన్నర్ లో ఎల్లప్పుడూ మ్యాచ్ విన్నర్ ఉన్నాడంటూ (AshWIN the SpinNER... WINNER) సచిన్ పేర్కొన్నారు. టెస్టు క్రికెట్లో 500 వికెట్ల ఘనత అతి పెద్ద మైలురాయి అని సచిన్ అభివర్ణించారు. కంగ్రాచ్యులేషన్స్ చాంపియన్ అంటూ అశ్విన్ ను అభినందించారు.


More Telugu News