కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

  • కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయాడన్న వైద్యులు
  • ఐటీలో మాస్టర్స్ చేసేందుకు కెనడా వెళ్లిన షేక్ అహ్మద్
  • వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని చెప్పిన కుటుంబ సభ్యులు
  • అహ్మద్ మరణించాడని స్నేహితులు ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడి
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి ఆకస్మిక మరణం పాలయ్యాడు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సదరు విద్యార్థి కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన షేక్ ముజామ్మిల్ అహ్మద్ మాస్టర్స్ చదివేందుకు కెనడా వెళ్లాడు. ఒంటారియోలోని వాటర్లూ వర్సిటీ క్యాంపస్ లో ఐటీలో పీజీ చేస్తున్నాడు.

ఈ క్రమంలో వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు అహ్మద్ ఫోన్ లో చెప్పాడని ఆయన తల్లిదండ్రులు వివరించారు. జాగ్రత్తగా ఉండాలని సూచించామని, ఇంతలోనే అహ్మద్ చనిపోయాడంటూ కొడుకు స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చిందన్నారు. జ్వరంతో బాధపడుతున్న అహ్మద్.. కార్డియాక్ అరెస్టుకు గురయ్యాడని, దీంతో ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారన్నారు. కొడుకు మరణంతో కన్నీటిపర్యంతమైన తల్లిదండ్రులు.. మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్ తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు.


More Telugu News