ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో అత్యవసర విచారణ

  • ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ 
  • సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమన్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్
  • డీఎడ్ అభ్యర్థులు నష్టపోతున్నారని వాదనలు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలోని టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ పై పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం అత్యవసర విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు నష్టపోతారని కోర్టుకు తెలిపారు. దీనిని అడ్డుకోవాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కేవలం డీఎడ్ అభ్యర్థులకు మాత్రమే కల్పించాలని కోరారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. సోమవారం అత్యవసర విచారణ జరుపుతామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తప్పుల తడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని పిటిషనర్ ఆరోపించారు. టీచర్ పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు, ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న విజ్ఞప్తికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపడతామని వెల్లడించింది.


More Telugu News